Yanamala: జైట్లీతో ముగిసిన టీడీపీ నేతల భేటీ.. వివరాలు తెలిపిన మంత్రి యనమల
- ప్రత్యేకహోదా, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇతర అంశాలపై చర్చించాం
- ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని చెప్పాం
- ఇతర రాష్ట్రాలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వాలి
- రైల్వే జోన్ గురించి కూడా మాట్లాడాం
ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర సర్కారు నుంచి రావాల్సిన ప్రయోజనాల విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో టీడీపీ నేతలు ఢిల్లీలో భేటీ అయిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలు సుజనా చౌదరి, యనమల రామకృష్ణుడు, రామ్మోహన్ నాయుడు ఏపీ విభజన సమస్యలపై జైట్లీకి వివరించారు. భేటీ ముగిసిన అనంతరం ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేకహోదా, పరిశ్రమలకు ప్రోత్సాహకాలతో పాటు ఇతర అంశాలపై చర్చించామని అన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని జైట్లీకి చెప్పామని యనమల అన్నారు. ఇతర రాష్ట్రాలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చినప్పుడు ఏపీకి కూడా ఇవ్వాలని అన్నామని తెలిపారు. రైల్వే జోన్ గురించి కూడా మాట్లాడామని, రాష్ట్ర పరిస్థితులను స్పష్టంగా వివరించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటు రావాల్సి ఉందని అన్నారు.