srilanka: నేటి నుంచి ముక్కోణపు టోర్నీ... ఫేవరేట్ భారతే!
- సగం మంది రెగ్యులర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన టీమిండియా
- తొలి మ్యాచ్ లో తలపడనున్న శ్రీలంక, భారత్
- శ్రీలంక వేదికగా టోర్నీ
చాన్నాళ్ల తర్వాత టీమిండియా సగానికి సగం రెగ్యులర్ ఆటగాళ్లు లేకుండా ముక్కోణపు టోర్నీలో పాల్గొనబోతోంది. ఒక రకంగా టీమిండియా రిజర్వ్ బెంచ్ ను పరీక్షించుకునే సిరీస్ లా ఇది కనబడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా పలువురు సీనియర్లకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు, సరికొత్త జట్టును ఎంపిక చేశారు. రోహిత్ శర్మ సారథ్యంలో జరగనున్న ఈ టీ20 సిరీస్ లో భారత జట్టు టైటిల్ ఫేవరేట్ గా కనిపిస్తోంది.
అదే సమయంలో శ్రీలంక, బంగ్లాదేశ్ పటిష్టమైన జట్లను పంపుతున్నాయి. రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా, జయదేవ్ ఉనద్కత్, శార్ధుల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ ఎలా ఆడుతారన్నదే సందేహం. బ్యాటింగ్ విభాగం విషయానికి వస్తే, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, సురేష్ రైనా, మనీష్ పాండే, దినేష్ కార్తీక్ తదితరులతో పటిష్టంగా ఉంది.
స్పిన్ బాధ్యతలు అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్ లు పంచుకోనున్నారు. దీంతో టీమిండియా బలంగానే కనబడుతోంది. ఐపీఎల్ ద్వారా జట్టులో స్థానం సంపాదించుకున్న పలువురు ఈ టోర్నీలో ఎలా ఆడతారన్న ఆసక్తి సెలక్షన్ బోర్డుతో పాటు అభిమానుల్లో కూడా ఆసక్తి రేపుతోంది. నేటి సాయంత్రం నుంచి టోర్నీ ఆరంభం కానుండగా, తొలి మ్యాచ్ భారత్, శ్రీలంక జట్ల మధ్య జరగనుంది.