leopard: అరణ్య రోదన! ఈ ఏడాది తొలి రెండు నెల్లలో 93 చిరుత పులుల మృత్యువాత!
- వేటగాళ్ల చేతుల్లో చిక్కి బలైపోతున్న చిరుత పులులు
- సహజంగా మృతి చెందినవి 12 మాత్రమే
- పులల మరణాల్లో అగ్రస్థానంలో ఉత్తరాఖండ్
ఈ ఏడాది తొలి రెండు నెలల్లో దేశవ్యాప్తంగా 93 చిరుత పులులు మృత్యువాత పడడంపై పర్యావరణవేత్తలు, వన్యప్రాణి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిలో చాలా వరకు వేటగాళ్ల వల్లే ప్రాణాలు కోల్పోయినట్టు చెబుతున్నారు. పులి చర్మం, గోర్లు, ఇతర వాటి కోసం వేటగాళ్లు యథేచ్ఛగా వాటిని సంహరిస్తున్నారని పేర్కొన్నారు.
చిరుత పులుల మరణాల్లో ఉత్తరాఖండ్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 24 పులులు మరణించాయి. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (18), రాజస్థాన్ (11)లు ఉన్నాయి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా (డబ్ల్యూపీఎస్ఐ) గణాంకాల ప్రకారం మృతి చెందిన వాటిలో కేవలం 12 పులులు మాత్రమే సహజంగా మృతి చెందగా, మిగతావి వేటగాళ్ల చేతుల్లో బలయ్యాయి. వీటిలో 8 పులులు రోడ్డు, రైలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయాయి. ఐదింటిని గ్రామస్థులు చంపేయగా, ఇతర పులులతో పోరాడుతూ మరో ఏడు మృతి చెందాయి. మరో ఐదు చిరుతలు.. పులులు, ఇతర జంతువుల దాడిలో మృతి చెందాయి. ఒకటి విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోగా రెండు రెస్క్యూ ఆపరేషన్‌లో మృతి చెందాయి. లక్నోలో ఒకదానిని పోలీసులు కాల్చి చంపారు.
గుజరాత్, జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో నాలుగు పులులను స్మగ్లర్ల నుంచి సజీవంగా స్వాధీనం చేసుకున్నారు. కాగా, గతేడాది ఇదే సమయానికి 131 పులులు మృతి చెందాయి.