Maoists: మావోల ప్రతీకారం... హైదరాబాద్ డిపో బస్సు దగ్ధం, ప్రయాణికుల ముందే కానిస్టేబుల్ కాల్చివేత!
- భారీ ఎన్ కౌంటర్ కు ప్రతీకారం
- 1న సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్
- రెండు బస్సులు, టిప్పర్, ట్రాక్టర్ కాల్చివేత
- నేతలు జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు
ఇటీవల తెలంగాణ, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకునే చర్యలకు దిగారు మావోయిస్టులు. గత రాత్రి హైదరాబాద్ నుంచి జగ్దల్ పూర్ కు బయలుదేరిన ఆర్టీసీ బస్సును సుకుమా జిల్లా దోర్నపాల్ సమీపంలోని కుర్తి గ్రామం సమీపంలో బస్సును అటకాయించి ప్రయాణికులను దించివేసి, బస్సును దగ్ధం చేశారు. డీజిల్ ట్యాంకును పగలగొట్టిన మావోయిస్టులు, ఆయిల్ ను చల్లి నిప్పంటించారు.
ఆపై అదే దారిలో వస్తున్న ఓ ప్రైవేటు బస్సును, టిప్పర్ ను, ఓ ట్రాక్టరును తగులబెట్టారు. బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువకుడిని కానిస్టేబుల్ అన్న అనుమానంతో ప్రయాణికుల ముందే అతన్ని కాల్చి చంపారు. ఆపై మావోయిస్టులు సమీపంలోని అడవుల్లోకి పారిపోగా, ప్రయాణికులు, డ్రైవర్లు దగ్గర్లోనే ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంపునకు చేరుకున్నారు. ఈ నెల 1న జరిగిన ఎన్ కౌంటర్ లో 10 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే.
కాగా, ఈ ప్రాంతంలోని తెలంగాణ ప్రజా ప్రతినిధులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎటువంటి పర్యటనలూ చేయరాదని పోలీసు అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.