Parliament: పోడియంలోకి టీఆర్ఎస్ కూడా... పట్టుమని నిమిషమైనా సాగని లోక్ సభ, రాజ్యసభ... వాయిదా!
- క్షణాల్లోనే వాయిదా పడ్డ లోక్ సభ, రాజ్యసభ
- పోడియంలోకి దూసుకొచ్చిన పలు పార్టీల ఎంపీలు
- రిజర్వేషన్ల పెంపును డిమాండ్ చేసిన టీఆర్ఎస్
ఈ ఉదయం పార్లమెంట్ పట్టుమని ఒక్క నిమిషం కూడా సాగలేదు. ఇరు సభలూ ప్రారంభమైన క్షణాల్లోనే వాయిదా పడ్డాయి. అటు లోక్ సభలో, ఇటు రాజ్యసభలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో పాటు, పలు ప్రతిపక్ష పార్టీల సభ్యులు సభ ప్రారంభంకాగానే పోడియంలోకి దూసుకు రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడగా, క్షణాల వ్యవధిలోనే ఇరు సభలూ వాయిదా పడ్డాయి.
రాజ్యసభలో టీడీపీ, వైఎస్ఆర్ సీపీ సభ్యులు ప్రత్యేక హోదా డిమాండ్ తోను, టీఆర్ఎస్ ఎంపీలు విభజన హామీల అమలును, తెలంగాణలో రిజర్వేషన్ల కోటాను పెంచాలన్న డిమాండ్ తోనూ, తమిళనాడు ఎంపీలు కావేరీ నదీ జలాల సమస్యను లేవనెత్తుతూ పోడియంలోకి దూసుకెళ్లారు. శివసేనతో పాటు కాంగ్రెస్ సభ్యులు కూడా పోడియం వైపు వెళ్లడంతో సభ జరిగే పరిస్థితి లేదని భావించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్ సభను, చైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభను వాయిదా వేశారు. ఆ తరువాత ఎంపీలంతా బయటకు వచ్చి గాంధీ విగ్రహం ముందు నినాదాలు చేస్తూ నిరసనలు కొనసాగించారు.