Pakistan: 2 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం నిలిపేసినా పాక్ మారలేదు: అమెరికా
- ఉగ్రవాదులతో సంబంధాలపై పాక్ తీరుమార్చుకోవాలని పలు మార్లు సూచించిన అమెరికా
- పాక్ తీరు మార్చుకోకపోవడంతో నిధుల్ని నిలిపేసిన అమెరికా
- తాలిబన్లను అరికట్టడంలో పాక్ సాయం చేస్తుందని నమ్ముతున్నాం
2 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని నిలిపేసినప్పటికీ పాకిస్థాన్ బుద్ధిమారలేదని అమెరికా వ్యాఖ్యానించింది. పాకిస్థాన్ తీరుపై అమెరికా అధికారులు మాట్లాడుతూ, పాక్ ప్రవర్తనలో కచ్చితమైన, నిర్ణయాత్మకమైన మార్పులు పెద్దగా కనిపించడం లేదని ఆరోపించారు. అఫ్గానిస్థాన్ లో శాంతి నెలకొల్పడంలో పాకిస్థాన్ ది కీలక పాత్ర అని వారు తెలిపారు. తాలిబన్లను అరికట్టేందుకు పాకిస్థాన్ సహాయం చేస్తుందని తాము ఇప్పటికీ నమ్ముతున్నామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాలిబన్లను అరికట్టడంలో పాక్ సహాయం చేయగలిగే ప్రాంతాల్లో సహాయం అందించాలని కోరుతూ, సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని వారు వెల్లడించారు. అయితే పాకిస్థాన్ ప్రవర్తన బట్టే ఆ దేశంతో తమ సంబంధాలు ఆధారపడి ఉంటాయని వారు స్పష్టం చేశారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించిన వారు, పాక్ తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు అమెరికా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.