ya jagan: మోదీజీపై నమ్మకం ఉంది... ప్రత్యేక హోదా ఇస్తారు: వైఎస్ జగన్ ఆశాభావం
- ఇది ఆంధ్రుల హక్కు
- మన ఆందోళనను ప్రధాని పరిగణనలోకి తీసుకుంటారు
- ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు
- ట్విట్టర్లో జగన్ ట్వీట్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇచ్చే విషయంలో ప్రధాని మోదీపై విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ వైసీపీ ఢిల్లీలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించిన విషయం గుర్తుండే ఉంటుంది. దీనికి సీపీఐ, సీపీఎం, ఆప్ మద్దతు పలికాయి. దీంతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
‘‘ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా డిమాండ్ ను ఢిల్లీకి తీసుకెళ్లే కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమైన నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు అందరికీ ధన్యవాదాలు. అలాగే, ఈ ధర్నాలో పాల్గొన్న సీపీఐ, సీపీఎం, ఆప్ నాయకులు, శ్రేణులకు కూడా కృతజ్ఞతలు. నరేంద్ర మోదీజీ మన ఆందోళనలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక హోదా మంజూరు చేస్తారని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇది మన హక్కు కూడా’’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.