Sri Lanka: ముక్కోణపు టోర్నీ: శ్రీలంకను గెలిపించిన కుశాల్ పెరీరా

  • కొనసాగుతున్న రోహిత్ పేలవ ఫామ్
  • రెచ్చిపోయిన శిఖర్ ధవన్
  • తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన భారత్

శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో మంగళవారం రాత్రి భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం 175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కుశాల్ పెరీరా 37 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 66 పరుగులు చేసి లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్లు దనుష్క గుణతిలక 19, కుశాల్ పెరీరా 11, దినేశ్ చండీమల్ 14, ఉపుల్ తరంగ 17, దాసన్ శంక 15, థిసార పెరీరా 22 పరుగులు చేశారు. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, జయ్‌దేవ్ ఉనద్కత్ ఓ వికెట్ పడగొట్టాడు.

అంతకుముందు తొలత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ తొలి ఓవర్ నాలుగో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది. దక్షిణాఫ్రికా టూర్ నుంచి పేలవ ఫామ్‌ను ప్రదర్శిస్తున్న రోహిత్ ఈ మ్యాచ్‌లోనూ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధవన్ మాత్రం శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. 49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 90 పరుగులు చేశాడు. సురేశ్ రైనా 1, మనీష్ పాండే 37, రిషబ్ పంత్ 23, దినేశ్ కార్తీక్ 13 పరుగులు చేశారు. లంక బౌలర్లలో దుష్మంత చమీర రెండు వికెట్లు పడగొట్టగా, నువాన్ ప్రదీప్, జీవన్ మెండిస్, దనుష్క గుణతిలక  చెరో వికెట్ తీసుకున్నారు. లంక విజయంలో కీలక పాత్ర పోషించిన కుశాల్ పెరీరాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది. ట్రై సిరీస్‌లో భాగంగా గురువారం భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది.

  • Loading...

More Telugu News