Rahul Gandhi: అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్
- ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతల ఆందోళన
- ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బీజేపీ మెడలు వంచొచ్చన్న రాహుల్ గాంధీ
- ఏపీ డిమాండ్‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే చేసే మొట్టమొదటి పని అదేనని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న ఏపీ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తామందరం కలిసికట్టుగా ఉంటే ప్రధాని నరేంద్రమోదీని ఒప్పించి ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోగలమన్న విశ్వాసం ఉందని చెప్పారు.
తర్వాత రాహుల్ ట్వీట్ చేస్తూ.. ఈ (ఏపీకి ప్రత్యేక హోదా) విషయమై ప్రతిపక్షాలన్నీ ఒక్కటైతే ఏపీకి న్యాయం చేయాలని బీజేపీపై ఒత్తిడి తీసుకురాగలమన్న విశ్వాసం తనకు ఉందని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల ఆందోళనలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి మాట్లాడుతూ ప్రత్యేక హోదా డిమాండ్‌కు తాము మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారని, ఏపీి డిమాండ్‌కు తమ మద్దతు ఉంటుందని చెప్పమన్నారని ఆయన తెలిపారు. పార్లమెంట్లోను, బయట ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ చేపట్టే ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని సోమ్‌నాథ్ భారతి స్పష్టం చేశారు.