Roja: దమ్ము, ధైర్యం లేని పురుషులే స్త్రీలను కించపరుస్తారు!: వైసీపీ ఎమ్మెల్యే రోజా
- నిర్ణయాధికారం మహిళల చేతుల్లోకి రావాలి
- మహిళా రిజర్వేషన్ అమలైతే సమస్య సద్దుమణుగుతుంది
- రాజకీయాలు తలనొప్పి వ్యవహారమే: రోజా
దమ్ము ధైర్యం లేని పురుషులే స్త్రీలను కించపరుస్తూ, వారిని అణచివేయడం, వారి సామర్థ్యాన్ని శంకించడం వంటివి చేస్తారని, ఇటువంటి వారు రాజకీయ రంగంలోనూ ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా వ్యాఖ్యానించారు. అటువంటి వారిది రాజకీయ ఆరాటమని, తాను చేస్తున్నది ప్రజల కోసం పోరాటమని వ్యాఖ్యానించిన ఆమె, భారత రాజకీయాల్లో మహిళలకు ఆలస్యంగా విజయం దక్కుతుందని, కానీ ఒకసారి సక్సెస్ ను అందుకున్నాక మరింత ఉన్నత స్థానానికి వెళతారని ఆమె అభిప్రాయపడ్డారు.
మహిళా సాధికారతపై ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన రోజా, జనాభాలో 50 శాతం మహిళలు ఉన్నప్పటికీ, నిర్ణయాధికారమంతా పురుషుల చేతుల్లోనే ఉందని, అది ఆడవాళ్ల చేతిలోకి రావడం కోసం తాను పోరాడుతున్నానని చెప్పారు. మహిళలకు పవర్ ఇవ్వాలని వ్యాఖ్యానించడం ఏంటని ప్రశ్నించిన ఆమె, ఇస్తే తీసుకోవడానికి తామేమైనా ద్వితీయ శ్రేణి పౌరులమా? అని అడిగారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలైతే ఈ సమస్య ఎదురు కాదని అభిప్రాయపడ్డారు.
రాజకీయాలు నిజంగానే తలనొప్పి వ్యవహారమని, ఇవి ఎప్పటికీ ప్రక్షాళన కాబోవని వ్యాఖ్యానించిన రోజా, చురుకుగా ఉండే మహిళలను ఎదుర్కోలేకనే వారి క్యారెక్టర్ పై నిందలు వేస్తుంటారని, అందరూ కలిసి తొక్కేయడానికి చూస్తారని ఆరోపించారు. కాల్ మనీ రాకెట్ లో అన్యాయమైన మహిళల కోసం తాను అసెంబ్లీలో నినదిస్తే, అన్యాయంగా నిందలు వేసి, నిబంధనలకు విరుద్ధంగా ఏడాది పాటు సస్పెండ్ చేశారని ఆరోపించారు. తన కుటుంబమే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమైతే ఇలాగే జరిగేదా? అని ప్రశ్నించారు. సస్పెన్షన్ వేటు పడినా ధైర్యంగా సమస్యను హైకోర్టుకు తీసుకు వెళ్లానని గుర్తు చేశారు.