Karti: కార్తీ చిదంబరం సీబీఐ కస్టడీని పొడిగించిన స్పెషల్ కోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు!

  • సీబీఐ కస్టడీని శుక్రవారం వరకు పొడిగించిన ప్రత్యేక కోర్టు
  • అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్న ఈడీ
  • ఐదు రోజుల కస్టడీలో కేవలం 25 నిమిషాలు మాత్రమే విచారించిన సీబీఐ

కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీకి మంగళవారం రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. సీబీఐ కస్టడీని శుక్రవారం వరకు పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేయగా , మరోవైపు మనీలాండరింగ్ కేసులో కార్తీని అరెస్ట్ చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధమవుతోంది.

ఐదు రోజుల కస్టడీ ముగియడంతో మంగళవారం కార్తీని కోర్టులో ప్రవేశపెట్టిన సీబీఐ కస్టడీ పొడిగించాలని కోరింది. సీబీఐ తరపు న్యాయవాది, అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ కార్తీని ప్రశ్నించేందుకు మరింత సమయం కావాలని కోరారు. లేకుంటే అతడు సాక్షులను ప్రభావితం చేయడంతోపాటు సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు.

సీబీఐ వాదనను కార్తీ తరపు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఐదు రోజుల కస్టడీలో కార్తీని కేవలం 25 నిమిషాలు మాత్రమే ప్రశ్నించారని, అటువంటప్పుడు మరిన్ని రోజుల కస్టడీ ఎందుకని ప్రశ్నించారు.

ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు కార్తీ కస్టడీని మరో మూడు రోజుల పాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈడీ జారీ చేసిన సమన్ల నుంచి తనకు రక్షణ కల్పించాల్సిందిగా సుప్రీంకోర్టులో కార్తీ చేసుకున్న అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది. ఈడీ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసేందుకు కోర్టు నిరాకరించింది.

  • Loading...

More Telugu News