Roja: మా ఇబ్బందులు మాకూ ఉంటాయి... అన్ని రోజులూ బయట తిరగలేము కదా?: రోజా
- బయలాజికల్ ఇబ్బందులు ఉంటాయి
- షేక్ హ్యాండ్ ఇస్తే ఇబ్బంది, ఇవ్వకుంటే తప్పుగా అనుకునే ప్రమాదం
- రాజకీయాల్లో మగవాళ్లకే అవకాశాలు అధికం
- ధైర్యం చేసి ప్రజల్లోకి వెళితే మహిళలూ రాణించే అవకాశం
రాజకీయాల్లో రాణించాలని భావిస్తూ ప్రజా జీవితంలోకి వచ్చే మహిళలు చిన్నవిగా అనిపించే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. ఓ దినపత్రికకు మహిళా సాధికారతపై ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, బయలాజికల్ గా తాము అన్ని రోజులూ బయట తిరగలేని పరిస్థితి ఉంటుందని వెల్లడించారు. పురుషులకు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు తమకెంతో ఇబ్బందిగా అనిపిస్తుందని, పోనీ ఇవ్వకుండా ఉందామా? అనుకుంటే తప్పుగా భావించే ప్రమాదం ఉంటుందని రోజా అభిప్రాయపడ్డారు.
ఇక మహిళా నేతలకు ఫాలోవర్లుగా ఉన్న వారిని పురుష నేతలు ఎగతాళి చేస్తారన్న భయంతోనూ పలువురు తమకు దూరంగా ఉంటుంటారని ఆమె చెప్పారు. రాజకీయాల్లోని పురుషులకు వారి ఇళ్ల నుంచి లభించేంత మద్దతు మహిళలకు లభించదని, ఏ సమయంలోనైనా ప్రజల్లోకి వెళ్లడం కొంత ఇబ్బందికరమని ఆమె తెలిపారు. రాజకీయాల్లో మహిళలతో పోలిస్తే పురుషులకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డ ఆమె, ఈ కాలం మహిళలు ధైర్యంగా ప్రజల్లోకి వెళితే, పురుషులతో పోలిస్తే మెరుగ్గా రాణించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు.