Donald Trump: వాణిజ్య యుద్ధానికి సిద్ధమే... ట్రంప్ సంకేతం
- ఇతర దేశాలతో వాణిజ్య పరంగా 800 బిలియన్ డాలర్ల లోటు
- స్టీల్, అల్యూమినియంపై సుంకాల విధింపును ప్రతిఘటిస్తే యుద్ధానికి సిద్ధమే
- వాణిజ్య పరంగానే కాదు, సైనిక పరంగానూ నష్టపోతున్నాం
- అగ్రరాజ్యాధిపతి నిస్పృహ వ్యాఖ్యలు
మిత్ర దేశాలతో వాణిజ్య యుద్ధానికి సిద్ధంగానే ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇతర దేశాలతో అమెరికాకు 800 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉందని, తమ దేశంలోకి దిగుమతి అయ్యే స్టీల్ పై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం సుంకాల విధింపును ప్రతిఘటిస్తే వారితో వాణిజ్య యద్ధానికి సిద్ధమేనన్నారు.
‘‘మీకు తెలుసు, కొన్ని సందర్భాల్లో మేము వాణిజ్యాన్ని కోల్పోతున్నాం. దీనికి అదనంగా వారికి సైనిక సాయం అందిస్తున్నాం. వారికి గణనీయంగా సబ్సిడీలు అందిస్తున్నాం. అంటే వాణిజ్యం మాత్రమే కోల్పోవడం లేదు, సైనిక పరంగానూ నష్టపోతున్నాం. మా దేశంలో ఈ విధమైన తీవ్ర లోటు ఉంది. కనుక దీన్ని ప్రేమ పూర్వక విధానంలో తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం’’ అని ట్రంప్ వైట్ హౌస్ వద్ద మీడియాతో చెప్పారు. స్టీల్, అల్యూమినియం టారిఫ్ లపై ఒక్కో దేశం వారీగా విధానాన్ని అనుసరించకపోవడాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు.