Camera: ఆలయంలో షూటింగ్... బాలీవుడ్ నటి రవీనా టాండన్ పై పోలీసు కేసు!
- ఆలయంలో 'నో కెమేరా జోన్'లో షూటింగ్లో పాల్గొందని ఆరోపణ
- నిషిద్ధ ప్రాంతం తనకు తెలియదని చెప్పిన హీరోయిన్
- షూటింగ్ జరగలేదని, స్థానికులే తనతో సెల్ఫీలు దిగారని వెల్లడి
నిబంధనలకు విరుద్ధంగా ఆలయం లోపల ఓ యాడ్ షూటింగ్లో పాల్గొన్నారని ఆరోపిస్తూ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. భువనేశ్వర్‌లోని లింగరాజ ఆలయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలో కెమేరాలు నిషిద్ధ ప్రాంతంలో ఆమె షూటింగ్లో పాల్గొన్నారంటూ ఆలయ పాలకవర్గం ఆరోపించింది. అయితే వారి ఆరోపణలను రవీనా తోసిపుచ్చింది. ఆలయం లోపల ఎలాంటి యాడ్ షూటింగ్ జరగలేదని ఆమె స్పష్టం చేసింది.
"ఆలయం లోపల ఎలాంటి షూటింగూ జరగలేదు. అందరూ స్థానికులు, ఆలయ ట్రస్ట్ సభ్యులు, కొంతమంది మీడియా మిత్రులు తమ మొబైళ్లలో నన్ను బంధించారు. వారే ఇష్టపడి నాతో సెల్ఫీలు దిగారు. అంతే...!" అని తనపై వచ్చిన ఆరోపణలకు రవీనా వివరణ ఇచ్చుకుంది. ఫోన్లు, కెమేరాల నిషిద్ధ ప్రాంతం గురించి తనకు ముందుగానే ఎవరూ చెప్పలేదని, అందువల్లే ఇదంతా జరిగిందని ఆమె వాపోయింది.
టెంపుల్ ప్రాంగణంలో టాండన్ బ్యూటీ టిప్స్ ఇస్తున్న వీడియోను ఎవరో షూట్ చేసి ఆన్లైన్లో అప్ లోడ్ చేయడంతో అది వైరల్‌గా మారింది. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఆ వీడియో తమ దృష్టికి రావడంతో ఆమెపై లింగరాజ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఆలయ అధికారి రాజీవ్ లోచన్ పరిదా తెలిపారు. తెలుగులో బంగారుబుల్లోడు, ఆకాశవీధిలో చిత్రాలతో రవీనా తన గ్లామర్‌తో మెప్పించిన సంగతి తెలిసిందే.