Brain dead: తాను లేకున్నా నలుగురి జీవితాల్లో వెలుగునింపిన ఎనిమిదేళ్ల బాలిక...!
- ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో మెదడు సంబంధిత వ్యాధితో మరణం
- ఆమె గుండె, కాలేయం, కిడ్నీలను దానం చేసిన తల్లిదండ్రులు
- ఇతరుల జీవితాల్లో వెలుగు నింపినందుకు ఆనందం
మెదడు సంబంధిత వ్యాధితో మరణించిన ఓ ఎనిమిదేళ్ల బాలిక అవయవదానంతో మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నిండాయి. ముంబై నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకెళితే... గతనెల 27న బంద్రాలోని లీలావతి హాస్పిటల్‌లో బాలికను చేర్పించారు. పరీక్షల అనంతరం ఆమె 'బ్రెయిన్ అన్యూరిజం' వ్యాధిబారిన పడినట్లు వైద్యులు నిర్థారించారు. ఇలాంటి వ్యాధి పిల్లల్లో చాలా అరుదుగా కనిపిస్తుంటుంది.
బాలిక తల్లిదండ్రులు ఆమెను కాపాడుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదని, సోమవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఆమె బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దాంతో ఆమె తల్లిదండ్రులు తమ బిడ్డ చనిపోయిందన్న బాధను దిగమింగుకుని ఆమె శరీరంలోని ముఖ్యమైన అవయవాలను దానం చేసేందుకు సమ్మతించినట్లు ఆసుపత్రిలోని డాక్టర్ సీతారాం గవదే తెలిపారు. బాలిక గుండెను ములుంద్‌లోని పోర్టిస్ హాస్పిటల్‌కు, కాలేయం, ఓ కిడ్నీని జస్లోక్ హాస్పిటల్‌కు, మరో కిడ్నీని లీలావతి హాస్పిటల్‌కు అప్పగించారు. ఇలా తమ బిడ్డ ప్రాణాలతో లేకపోయినా అవయవదానం ద్వారా మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపినందుకు వారు ఆనందపడుతున్నారు.