Chandrababu: అధ్యక్షా... చంద్రబాబు గురించి మాట్లాడినా.. చప్పట్లు కొట్టరా?: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణు సరదా వ్యాఖ్యలు
- ఏపీకి దక్కిన వరం చంద్రబాబు
- చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తాయి
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్నీ చేస్తుంది
ఏపీకి దక్కిన వరం ముఖ్యమంత్రి చంద్రబాబు అని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. హుదూద్ తుపానుతో అతలాకుతలం అయిన విశాఖను సుందరంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రిపై తనకు ఎంతో గౌరవం ఉందని అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ విష్ణు ఈ విధంగా చెప్పారు.
ఆయన మాట్లాడుతున్న సమయంలో సభ్యులెవరూ చప్పట్లు కొట్టకపోవడంతో ఆయన సరదాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అధ్యాక్షా... తాను చంద్రబాబు గురించి పొగుడుతున్నా... ఎవరూ చప్పట్లు కొట్టడం లేదని, తనపై ఎందుకింత వివక్ష? అని అన్నారు. దీంతో, ఆ తర్వాత నుంచి చంద్రబాబును విష్ణు ప్రశంసించినప్పుడల్లా టీడీపీ సభ్యులు చప్పట్లు కొట్టారు.
2002 నాటికి దేశంలోనే ఏపీని మొదటి స్థానంలో నిలపడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుందని విష్ణు చెప్పారు. ఏపీ ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని అన్నారు. ఏపీకి అన్యాయం జరిగితే చూస్తూ, ఊరుకోబోమని చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులను, సంస్థలను కేంద్రం ఏర్పాటు చేస్తోందని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టే... ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని తన భార్య కూడా అడుగుతోందని అన్నారు. విశాఖ రైల్వే జోన్ వస్తుందని చెప్పారు.