Narendra Modi: వేతనం కోల్పోయిన జవానుకు ఊరట.. ప్రధాని జోక్యంతో శిక్ష ఉపసంహరణ
- పరేడ్‌లో ప్రధానిని గౌరవించని జవాను
- వేతనంలో ఏడు రోజుల కోత
- గత నెల 21 న ఘటన
పరేడ్‌లో ప్రధాని నరేంద్రమోదీని అవమానించారని ఆరోపిస్తూ ఓ బీఎస్ఎప్ జవాను వేతనంలో ఏడు రోజుల జీతాన్ని కట్ చేస్తూ విధించిన శిక్షను బీఎస్ఎఫ్ ఉపసంహరించుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరి 21న పశ్చిమబెంగాల్‌లోని మహత్‌పూర్ బీఎస్ఎఫ్ 15వ బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్‌లో రోజువారీ నిర్వహించే పరేడ్‌లో పాల్గొన్న కానిస్టేబుల్ సంజీవ్ కుమార్ రిపోర్టు ఇస్తూ ‘మోదీ ప్రోగ్రాం’ అని పేర్కొన్నాడు. మోదీకి ముందు గౌరవసూచకంగా ఉపయోగించే ‘ఆనరబుల్’, ‘శ్రీ’ వంటి పదాలను ఉపయోగించకపోవడంతో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ అనూప్ లాల్ భగత్ తీవ్రంగా పరిగణించారు. అతడి వేతనంలో ఏడు రోజుల కోత విధించారు.
కమాండింగ్ ఆఫీసర్ నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వ్యక్తం కావడంతో విషయం ప్రధాని మోదీ దృష్టికి వెళ్లింది. స్పందించిన మోదీ ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించడంతో వాటిని వెనక్కి తీసుకున్నారు.