Siva Sena: మోదీకి గడ్డుకాలమే... అందరూ దూరమవుతారు: శివసేన సంచలన వ్యాఖ్య
- ఈ పరిణామాన్ని ముందే ఊహించాం
- భాగస్వామ్య పార్టీలను ఎలా చూసుకోవాలో బీజేపీకి తెలియదు
- ఇక ఒక్కో పార్టీ వైదొలగుతాయి
- శివసేన నేత సంజయ్ రౌత్
ఎన్డీయేలో భారతీయ జనతా పార్టీకి ప్రధాన భాగస్వామ్య పక్షాల్లో ఒకటైన తెలుగుదేశం కేంద్ర ప్రభుత్వం నుంచి తన మంత్రులను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో మరో భాగస్వామి శివసేన సంచలన వ్యాఖ్యలు చేసింది.
"ఈ పరిణామాన్ని ముందుగానే గమనించాం. ఎన్డీయే నుంచి ఇతర పార్టీలు కూడా బయటకు రానున్నాయి" అని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. భాగస్వామ్య పక్షాలతో ఎలా కలిసి మెలసి ఉండాలో ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి తెలియడం లేదని, కూటమి నుంచి ఒక్కో పార్టీ వైదొలగుతూ ఉంటే మోదీకి గడ్డుకాలమేనని హెచ్చరించారు.
శివసేన ఎంపీ అరవింద్ సావంత్ సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మిత్ర పక్షాలను గౌరవించడం బీజేపీ పెద్దలకు తెలియడం లేదని, ఈ విషయం తెలుగుదేశం పార్టీ అందరికన్నా ముందుగానే గ్రహించిందని అన్నారు. 'అందరితో కలసి' (సబ్ కా సాథ్) అని చెప్పే బీజేపీ, ఆ పని ఏమాత్రమూ చేయకుండా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ వెళుతోందని, తెలుగుదేశం నిర్ణయంతో బీజేపీ నిజస్వరూపం మరోసారి బయటకు వచ్చిందని విమర్శించారు.