KTR: అశోక్ గజపతిరాజు రాజీనామా వార్త చదివి ఆశ్చర్యపోయాను: కేటీఆర్
- రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం
- రాజకీయాల్లో అన్నింటికీ సిద్ధంగా ఉండాలి
- పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన సేవలు ప్రశంసనీయం
ఉదయం లేవగానే వార్తా పత్రికల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు రాజీనామా వార్త చూసి ఆశ్చర్యపోయానని ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులోని బేగంపేటలో నిర్వహించిన వింగ్స్ ఇండియా సదస్సుకు ఆయన గైర్హాజరు కావడంపై కేటీఆర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన సదస్సుకు హాజరుకాలేకపోయారని, దీంతోనే తాను ముఖ్యఅతిథిగా వ్యవహరించాల్సి వచ్చిందని తెలిపారు.
పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో 70 ఏళ్లలో 70 విమానాశ్రయాలు ఉంటే, అశోక్ గజపతి రాజు సారథ్యంలో గడిచిన మూడేళ్లలో 50 నుంచి 60కిపైగా కొత్త విమానాశ్రయాలు ఏర్పాటయ్యాయని ఆయన తెలిపారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేమని చెప్పిన ఆయన, అన్నింటికీ సిద్ధంగా ఉండాలని అన్నారు.