afganistan: అవుటవడాన్ని జీర్ణించుకోలేక.. పిచ్ ను పాడుచేసిన ఆఫ్ఘన్ బ్యాట్స్ మన్
- మూడు ఫోర్లు కొట్టి మంచి జోరుమీదున్న షాజాద్
- రెండో వికెట్ గా వెనుదిరిగిన వైనం
- పిచ్ పక్కన బ్యాట్ తో గట్టిగా బాదిన షాజాద్
అవుట్ కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్ మన్ పిచ్ ను నష్టపరిచిన ఘటన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ టోర్నీలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. జింబాబ్వేలోని బులవాయో వేదికగా జరుగుతున్న వరల్డ్ క్వాలిఫయర్ పోటీల్లో గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్థాన్ ఆడుతోంది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో 197 పరుగుల విజయ లక్ష్యంతో దిగిన ఆఫ్ఘన్ జట్టును ఆతిథ్య జట్టు అద్భుత ఆటతీరుతో కట్టడి చేసింది.
మూడు ఫోర్లు కొట్టి మంచి జోరుమీదున్న వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ మహమ్మద్ షాజాద్ (24) అవుటయ్యాడు. దీనిని జీర్ణించుకోలేని షాజాద్, పిచ్ పక్కన బ్యాటుతో బలంగా బాదాడు. దీంతో ఆ ప్రాంతం దెబ్బతింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ, అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించి, మిగిలిన క్వాలిఫయర్ మ్యాచ్ లపై నిషేధం విధించింది. దీంతో ఆఫ్ఘన్ జట్టుకు షాక్ తగిలింది. డోపింగ్ ఆరోపణలతో ఇప్పటికే ఏడాది పాటు క్రికెట్ కి దూరమైన షాజాద్ మరో రెండు నెలలు ఆటకు దూరంకానున్నాడు. కాగా, ఈ మ్యాచ్ లో ఆప్ఘనిస్థాన్ ఓటమిపాలైంది.