Yanamala: రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీని తలపిస్తోంది: ఏపీసీసీ విమర్శలు
- గతేడాది బడ్జెట్ కేటాయింపుల్లో పూర్తిగా నిధులు ఖర్చు చేయలేక పోయారు
- ఇప్పుడు బడ్జెట్ రూ.2 లక్షలకు చేరువగా వెళ్లడం హాస్యాస్పదం
- వ్యవసాయం, నీటి పారుదలకు మొక్కుబడిగా కేటాయింపులు
- పోలవరం ప్రాజెక్టుకే రూ.9 వేల కోట్లు పోతే మిగతా ప్రాజెక్టుల మాటేమిటి?
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీని తలపిస్తోందని ఏపీసీసీ పేర్కొంది. గత ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లో పూర్తిగా నిధులు ఖర్చు చేయలేని ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్ ను రూ.2 లక్షలకు చేరువగా వెళ్లడం హాస్యాస్పదంగా ఉందని తెలుపుతూ ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ పేరిట ఏపీసీసీ నుంచి ప్రెస్ నోట్ విడుదలైంది.
రాష్ట్రాభివృద్ధికి కీలక రంగాలైన వ్యవసాయం, నీటి పారుదలకు మొక్కుబడిగా కేటాయింపులు జరిపారని అన్నారు. నీటిపారుదలకు రూ.16,978 కోట్లు మాత్రమే ఆర్థిక మంత్రి ప్రకటించారని తెలిపారు. ఇందులో పోలవరం ప్రాజెక్టుకే రూ.9 వేల కోట్లు పోతే మిగతా ప్రాజెక్టుల మాటేమిటని ప్రశ్నించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా గ్రామాల్లో సైతం రక్షిత మంచి నీరు అందిస్తామని వాగ్దానం చేసిన సర్కారు.. ఆ దిశగా చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. ఈ పథకానికి కేవలం రూ.150 కోట్లే కేటాయించడం దారుణమని, గ్రామాల్లో కలుషిత నీటిని తాగి కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టిచుకోవడం లేదని అన్నారు.