Chandrababu: సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పిన మంత్రి జవహర్
- రాష్ట్ర బడ్జెట్ లో మాదిగలు, చర్మకారుల సంక్షేమానికి పెద్దపీట
- డప్పు కళాకారుల కోసం రూ.12 కోట్లు కేటాయించారు
- కాంగ్రెస్ హయాంలో నిర్వీర్యమైన లిడ్ క్యాప్
- ఆ వ్యవస్థకు పునర్జీవం కల్పించిన ఘనత చంద్రబాబుదే : జవహర్
2018-19 బడ్జెట్ లో మాదిగలు, చర్మకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అధిక నిధులు కేటాయించిన సీఎం చంద్రబాబునాయుడుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్. జవహర్, మాదిగ జేఏసీ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో జవహర్ మాట్లాడుతూ, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకూ ఎంతో మేలు చేస్తుందని అన్నారు.
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా డప్పు కళాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లు కేటాయించిందని హర్షం వ్యక్తం చేశారు. చర్మకారుల అభివృద్ధికి రూ.60 కోట్లు, లిడ్ క్యాప్ నకు రూ.40 కోట్లు బడ్జెట్ లో కేటాయించారని, మాదిగలను కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా వారి సంక్షేమానికి పెద్దపీట వేయడం చంద్రబాబునాయుడు చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడారు. కాంగ్రెస్ హయాంలో లిడ్ క్యాప్ నిర్వీర్యమైందని, ఆ వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించిన ఘనత చంద్రబాబునాయుడిదేనని ప్రశంసించారు. ముఖ్యంగా సమాజంలో నిరాదరణకు గురవుతున్న హిజ్రాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వారి సంక్షేమానికి రూ.20 కోట్లు కేటాయించడం అభినందనీయమని ప్రశంసించారు.