China: మనం దెబ్బలాడుకోవద్దు.. డ్యాన్స్ చేద్దాం.. భారత్‌కు స్పష్టం చేసిన చైనా
- డ్రాగన్-ఏనుగు డ్యాన్స్ చేయాలి
- పతాక శీర్షికలకు ఎక్కాలన్న ఆలోచన లేదు
- 1కి 1 కలిస్తే రెండు కాదు.. 11 కూడా అవుతుంది
- భారత్‌తో సంబంధాలపై చైనా విదేశాంగ మంత్రి
భారత్-చైనాలు కలహించుకోవడాన్ని మాని ఆనందంతో కలసి నృత్యం చేయాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి పిలుపు నిచ్చారు. తాము పతాక శీర్షికల కోసం ఆరాటపడడం లేదని, అటువంటి ప్రయత్నాలు సముద్రంలో నురుగలా కాసేపటికే చెల్లాచెదురవుతాయని అన్నారు. డ్రాగన్ (చైనా), ఏనుగు (భారత్) రెండూ ఘర్షణ పడకూదని, నృత్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ చతుర్ముఖ చర్చల పునరుద్ధరణ ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. దీనికంటే తాము చేపట్టిన ‘వన్ బెల్ట్, వన్ రోడ్’ ప్రాజెక్టుకే ఎక్కువ మద్దతు ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు వంద దేశాలు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. ఇండో-చైనా సంబంధాల్లో గతేడాది పరీక్షా కాలం ఎదురైందని, అయితే సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నించి విజయం సాధించాయని అన్నారు. ఇందులో వ్యూహాత్మక దార్శనికత దాగి ఉందన్నారు. పరస్పర నమ్మకమే ఇరు దేశాల సంబంధాల్లో అత్యంత విలువైన అంశమని పేర్కొన్న వాంగ్ యి.. ఒకటికి ఒకటి కలిస్తే రెండు మాత్రమే కాదని, 11 కూడా అవుతుందని అభివర్ణించారు.