jayalalita: జయలలిత మరణించిన తరువాత ఆమె కాలి వేళ్లను నేనే కట్టాను!: డ్రైవర్ అయ్యప్పన్
- అపస్మారక స్థితిలోనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు
- ఆసుపత్రిలో ఆమెను మూడు సార్లు చూశాను
- జయలలిత కాళ్లు తొలగించలేదు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణించిన తరువాత ఆమె కాలి వేళ్లను తానే కట్టానని ఆమె మృతిపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ ఆరుముఖస్వామి కమిషన్ ముందు ఆమె కారు డ్రైవరు అయ్యప్పన్ వెల్లడించారు. జయలలిత కాళ్లను తొలగించారంటూ జరిగిన ప్రచారం అవాస్తవమని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జయలలిత అనారోగ్యానికి గురయ్యారంటూ తనకు రాత్రిపూట సమాచారం అందిందని అన్నారు.
ఆసుపత్రికి వెళ్లేందుకు తొలుత ఆమె నిరాకరించారని, దీంతోనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత ఆసుపత్రికి తరలించారని గుర్తుచేసుకున్నారు. ఆసుపత్రిలో చేరిన ముప్పావు గంట తరువాత ఆమె స్పృహలోకి వచ్చారని ఆయన తెలిపారు. ఆమె ఆసుపత్రిలో ఉండగా మూడుసార్లు తాను చూశానని అన్నారు. ఆమె కాళ్లు తొలగించలేదని, ఆమె మరణించిన తరువాత ఆమె కాలి వేళ్లను తానే కట్టానని ఆయన వెల్లడించారు.
కాగా, 2016 సెప్టెంబరులో అనారోగ్యానికి గురైన జయలలితను చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్చగా డిసెంబరు 5న ఆమె మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అనంతరం ఆమె మృతిపై పలు అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఆఖరుకి ఆమె కాళ్లను తొలగించినట్టు కూడా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.