Sonia Gandhi: గతాన్ని తలచుకుని కన్నీరు పెట్టుకున్న సోనియా గాంధీ
- ఇంటర్వ్యూలో తన భర్తను తలచుకున్న సోనియా
- ఇందిరా గాంధీ హత్య అనంతరం రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడం అనివార్యమైంది
- ఆయన కూడా కుటుంబానికి దూరమవుతారని ఆందోళన చెందాను
- అందుకే అప్పట్లో ఆయనను రాజకీయాల్లోకి రావద్దన్నాను
ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన భర్తను గుర్తు తెచ్చుకుని కన్నీరు పెట్టుకున్నారు. రాజకీయాల్లో ప్రజాసేవ మాత్రమే మొదటి ప్రాధాన్య అంశమని మిగతావన్నీ ఆ తరువాతేనని ఆమె అన్నారు. తన అత్త ఇందిరా గాంధీ హత్య అనంతరం తన భర్త రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడం అనివార్యమైందని చెప్పారు. అయితే, ఆయన కూడా కుటుంబానికి దూరమవుతారని తాను ఆందోళన చెందానని తెలిపారు.
అందుకే తాను అప్పట్లో ఆయనను రాజకీయాల్లోకి రావద్దన్నానని, అలా అనడం తన స్వార్థమే కావచ్చని సోనియా గాంధీ చెప్పారు. ఆయనను హత్య చేస్తారనే భయం తమలో ఉండేదని, చివరికి భయపడినట్లు జరిగిందని చెప్పి సోనియా గాంధీ కన్నీరు పెట్టుకున్నారు. రాజీవ్ గాంధీని 1991లో ఎల్టీటీఈ తీవ్రవాదులు హత్య చేసిన విషయం తెలిసిందే.