Kamineni Srinivas: అవినీతికి పాల్పడలేదని.. కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో కామినేని శ్రీనివాస్ ప్రమాణం
- ఈ రోజు ప్రమాణం చేస్తానని నిన్న ప్రకటించిన కామినేని
- చెప్పినట్లే చిత్తూరుకి వెళ్లి వినాయక ఆలయంలో ప్రమాణం
- ప్రమాణం చేయడంతో తన ఆత్మస్థైర్యం పెరిగిందని వ్యాఖ్య
తాను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరూపాయి కూడా ఎవరి వద్ద నుంచి తీసుకోలేదని బీజేపీ ఏపీ నేత కామినేని శ్రీనివాస్ నిన్న అసెంబ్లీలో ఉద్వేగపూరితంగా మాట్లాడిన విషయం తెలిసిందే. అలాగే, నిన్న మాట్లాడుతూ.. తాను అవినీతికి పాల్పడలేదని చిత్తూరు జిల్లాలోని కాణిపాక వరిసిద్ధి వినాయక ఆలయంలో ప్రమాణం చేయనున్నట్లు కూడా తెలిపారు. చెప్పిన విధంగానే ఈ రోజు పలువురు బీజేపీ నేతలతో కలిసి చిత్తూరు జిల్లాకు వచ్చి కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రమాణం చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయడంతో తన ఆత్మస్థైర్యం పెరిగిందని తెలిపారు. మంత్రి పదవిలో ఉండగా తాను ఎటువంటి అవినీతికీ పాల్పడలేదని మరోసారి ఉద్ఘాటించారు. కాగా, ఆయనపై పలువురు టీడీపీ నేతలు విమర్శలు చేస్తోన్న నేపథ్యంలో ఇలా ప్రమాణం చేశారని తెలుస్తోంది.