Drunken Drive: నగరాన్ని వదిలి బయటకు... ఓఆర్ఆర్ పై 16 ఎంటర్, 15 ఎగ్జిట్ల వద్ద ఒకేసారి డ్రంకెన్ డ్రైవ్!
- శుక్రవారం రాత్రి ఔటర్ పై తనిఖీలు
- పట్టుబడిన 100కు పైగా వాహనాలు
- టూ వీలర్లు కూడా
సాధారణంగా జంట నగరాల్లో వారాంతం రోజుల్లో రాత్రిపూట పోలీసులు పలు ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ ను విస్తృతంగా నిర్వహిస్తుంటారన్న సంగతి తెలిసిందే. రోడ్లపై మకాం వేసి, మందు కొట్టి వాహనాలు నడిపే వారిని గుర్తించి కేసులు పెడుతుంటారు. కానీ, శుక్రవారం రాత్రి నగరంలో డ్రంకెన్ డ్రైవ్ కనిపించలేదు. నగరాన్ని వదిలిన పోలీసులు, ఇటీవలి కాలంలో ప్రమాదాలకు నిలయంగా మారిన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వైపు దృష్టి సారించారు. ఓఆర్ఆర్ కు ఉన్న 16 ఎంటర్, 15 ఎగ్జిట్ మార్గాల వద్దా మోహరించారు. ఔటర్ పైకి ఎక్కిన, దిగిన ప్రతి వాహనాన్నీ తనిఖీ చేశారు. మందు కొట్టి ఔటర్ ఎక్కిన 100కు పైగా వాహనాలను బుక్ చేశారు. ఔటర్ పై ద్విచక్ర వాహనాలకు ప్రవేశం లేకపోగా, పోలీసుల తనిఖీల్లో టూవీలర్లు సైతం పట్టుబడటం గమనార్హం.