Gujarath Assembly: షుగర్, బీపీ ఎంఎల్ఏలకు గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ తీపికబురు!
- షుగర్, బీపీ ఎంఎల్ఏల కోసం అసెంబ్లీ సమావేశాల వేళల్లో మార్పులు
- వారికి మధ్యాహ్న భోజన ఏర్పాట్లకు నిర్ణయం
- ఇకపై ఉదయం సెషన్ 9.30 గంటలకు మొదలు
షుగర్, బీపీ వ్యాధులతో బాధపడుతున్న ఎంఎల్ఏలకు గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది తీపివార్త వినిపించారు. ఈ రోగాలతో బాధపడుతున్న శాసనసభ్యుల ఔషధాల వినియోగం, ఆహార నియమాలను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ సమావేశాల వేళల్లో మార్పులు చేయనున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాక అసెంబ్లీలోని ఎంఎల్ఏలందరికీ మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ నిర్ణయం వల్ల శాసనసభ్యులు ప్రత్యేకించి చక్కెర వ్యాధిబారిన పడినవారు తమకు అనువైన ఆహార ఏర్పాట్లు చేసుకునే అవసరముండదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే, ఎంతమంది ఎంఎల్ఏలకు షుగర్, బీపీ ఉందో అధికారికంగా తెలియకపోయినా మొత్తం 182 మంది సభ్యుల్లో మంత్రులు సహా 40 మందికి పైగా ఈ రోగాలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త మార్పుల ప్రకారం, ఇకపై ఉదయపు సెషన్లు ఉన్నప్పుడు సభ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. అంతకుముందు ఉదయం 8.30 గంటలకు సభా కార్యకలాపాలు మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఇతర రోజుల్లో సెషన్లు మధ్యాహ్నం కాకుండా ఉదయం 11.00 గంటలకే మొదలవుతాయి. కాగా, అధికార, విపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంఎల్ఏలు, మంత్రులు, ప్రభుత్వాధికారులు చేసిన వినతి మేరకు ఈ మేరకు సభా సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు త్రివేది మీడియాకి తెలిపారు.