Australia: చెలరేగిన రబాడ... రసకందాయంలో రెండో టెస్ట్
- పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు
- తొలి రోజు సఫారీ బౌలర్లదే పై చేయి
- ఐదు వికెట్లతో రబాడ, మూడు వికెట్లతో ఎన్గిడి, రెండు వికెట్లతో ఫిలాండర్
పోర్ట్ ఎలిజబెత్ వేదికగా ఆసీస్, ప్రోటీస్ మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. తొలి టెస్టులో వివాదాస్పద ఆటతీరుతో జరిమానాలు, మందలింపులు ఎదుర్కొన్న ఆటగాళ్లు రెండో టెస్టులో హోరాహోరీ ఆడుతున్నారు. తొలిరోజు ఆటలో రబాడ చెలరేగగా, వార్నర్ ఆకట్టుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 71.3 ఓవర్లలో 243 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాట్స్ మన్ లో డేవిడ్ వార్నర్ (63) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా, బాన్ క్రాఫ్ట్ (38), పైన్ (36) స్టీవ్ స్మిత్ (25), షాన్ మార్ష్ (24) ఫర్వాలేదనిపించారు. సఫారీ బౌలర్లలో ఐదు వికెట్లతో రబాడ ఆధిపత్యం ప్రదర్శించగా, ఎన్గిడి మూడు, ఫిలాండర్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన సఫారీ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో ఓపెనర్ మార్ క్రమ్ (11) వికెట్ కోల్పోయి 39 పరుగులు చేసింది. క్రీజులో ఎల్గర్ (11), రబాడ (17) ఉన్నారు.