India: పాకిస్థాన్ నుంచి తాము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు: పాక్ పై భారత్ నిప్పులు
- మాకు పాఠాలు చెప్పే స్థితిలో పాక్ లేదు
- పాకిస్థాన్ ముమ్మాటికీ ఉగ్ర దేశమే
- ముంబై కాల్పులను, యూరీ దాడులనూ మరచిపోలేము
- ఐరాస వేదికగా నిప్పులు చెరిగిన భారత్
మానవ హక్కులను కాపాడే విషయంలో పాకిస్థాన్ నుంచి తాము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని భారత్ నిప్పులు చెరిగింది. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ ఐక్యరాజ్యసమితి వేదికగా చేస్తున్న ఆరోపణలను భారత్ ఖండిస్తూ, ఆ దేశం ముమ్మాటికీ ఉగ్రవాద దేశమేనని ఉటంకించింది. ఓ ఉగ్ర దేశం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటూనే విమర్శలు గుప్పించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాక్ తమకు పాఠాలు చెప్పే స్థాయిలో లేదని ఎద్దేవా చేసింది. మానవ హక్కుల గురించి పాకిస్థాన్ చెబితే నేర్చుకోవాల్సిన స్థితిలో ఇండియా లేదని ఐరాసలో భారత కార్యదర్శి మాట్లాడారు.
ముంబై కాల్పులను, యూరీ దాడులను తాము మరచిపోలేదని వ్యాఖ్యానించిన మినీ దేవీ కుమమ్, పాకిస్థాన్ లో ఉగ్రవాదులు ఎక్కడలేనీ స్వేచ్ఛనూ అనుభవిస్తున్నారని, ఓ విఫలమైన దేశం నుంచి ప్రపంచానికి ఎటువంటి సలహాలు, సూచనలూ అక్కర్లేదని అన్నారు. గతంలో ఒసామా బిన్ లాడెన్ కు పాకిస్థాన్ ఆశ్రయం ఇచ్చి అంతర్జాతీయ సమాజం ముందు దొరికిపోయిందని, ముంబై దాడుల ప్రధాన నిందితుడు హఫీజ్ సయీద్ ఇప్పటికీ పాక్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని ఆమె ఆరోపించారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పాక్ సర్కారు వారిని పెంచి పోషిస్తోందని చెబుతూ, అమెరికా సైతం హఫీజ్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిందన్న సంగతిని గుర్తు చేశారు.