Chandrababu: రెండు సీట్లకే పోటీ చేయాలని చంద్రబాబు ఆలోచన... కొత్త తలనొప్పి మొదలు!
- బలమున్నంత వరకే బరిలోకి దిగుదాం
- నేతలతో చెప్పిన చంద్రబాబు
- సామాజిక న్యాయం చేయాలని నేతల ఒత్తిడి
తమకు ఉన్న ఎమ్మెల్యేల బలానికి అనుగుణంగా రెండు రాజ్యసభ స్థానాలకు మాత్రమే పోటీ చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మూడో అభ్యర్థిని పోటీకి దింపి, అతని విజయానికి అవసరమై ఇద్దరు ఎమ్మెల్యేలను ఆకర్షించగలిగినా, బీజేపీ మద్దతు కూడా కీలకంగా ఉండటం, మారిన రాజకీయ పరిస్థితుల్లో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలతో ఓట్లు వేయించడం క్లిష్టమవుతుందని, ఆ పార్టీ అధిష్టానం వద్ద మోకరిల్లితే తప్ప మూడు స్థానాలూ తమకు లభించవని భావిస్తున్న చంద్రబాబు, పరిస్థితిని అంతవరకూ తీసుకు వెళ్లరాదనే భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇద్దరిని మాత్రమే బరిలోకి దింపుతానని చంద్రబాబు, తన నేతల వద్ద వ్యాఖ్యానించగా, ఆ వెంటనే సామాజిక న్యాయమంటూ వివిధ వర్గాల వారు ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓ దఫా రాజ్యసభ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సీఎం రమేష్ కు మరో అవకాశం ఇస్తే, రెండో స్థానాన్ని తమకు ఇవ్వాలని బీసీ నేతలు ఓ వైపు నుంచి, మైనారిటీ నేతలు మరో వైపు నుంచి, ముందు హామీ ఇచ్చినట్టుగా తమకు ఇవ్వాలని రెడ్డి వర్గం నేతలు చంద్రబాబు ముందు తమ డిమాండ్ల చిట్టా విప్పుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది మరి కొన్ని గంటల సస్పెన్స్.