Jagan: రాజీనామాలు చేశారు.. కానీ ఎన్డీయేలోనే కొనసాగుతారట: జగన్
- ఏపీకి 'హోదా' లేదని తొలిసారి జైట్లీ ప్రకటన చేసినప్పుడే రాజీనామా చేస్తే బాగుండేది
- ఇప్పటికే ప్రత్యేక హోదా వచ్చి ఉండేది
- 'హోదా' కోసం మేము నిరాహార దీక్ష చేస్తోంటే దాన్ని అణగదొక్కేయాలని చూశారు
- మీకు మోసం చేసే నాయకుడు కావాలా?
ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ముందుకు వచ్చారని, సంతోషమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజా సంకల్ప యాత్ర కొనసాగిస్తోన్న జగన్.. ఈ రోజు ప్రకాశం జిల్లా చీరాల క్లాక్ టవర్ సెంటర్ వద్ద ప్రసంగించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అప్పట్లో ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెబితే ఆనాడు ప్రశ్నించని చంద్రబాబు ఈనాడు మాత్రం తమ నేతలతో కేంద్ర మంత్రి పదవులకి రాజీనామాలు చేయించారని అన్నారు.
ఈ పని జైట్లీ మొదటిసారి ప్రకటన చేసినప్పుడే చేసి ఉంటే ఈ పాటికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేది కాదా? అని జగన్ ప్రశ్నించారు. "ముఖ్యమంత్రి కాక ముందు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రత్యేక హోదాను పట్టించుకోలేదు.. ప్రత్యేక హోదా కోసం తాము నిరాహార దీక్ష చేస్తోంటే దాన్ని అణగదొక్కేయాలని చూశారు. తమ నేతలతో కేంద్ర మంత్రి పదవులకి రాజీనామా చేయించారు.. కానీ ఎన్డీయేలోనే కొనసాగుతారట.
నిన్న అసెంబ్లీలో చూశాం.. చంద్రబాబుని బీజేపీ నేతలు పొగిడారు.. బీజేపీ నేతలని టీడీపీ నేతలు పొగిడారు. ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు ఉన్నారు. మేము అవిశ్వాసం పెడతామని, కేంద్ర ప్రభుత్వం దిగి రాకుండా పోతుందా? అని చెప్పాం. తాము సహకరించబోమని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. మీకు మోసం చేసే నాయకుడు కావాలా? అసత్యాలు చెప్పే నాయకుడు కావాలా? ఇటువంటి వారిని పొరపాటున కూడా క్షమించకూడదు" అని జగన్ అన్నారు.