Sonia Gandhi: మోదీ గురించి అంత మాట అంటారా?: సోనియాపై మండిపడ్డ బీజేపీ
- మోదీని మళ్లీ నేను రానివ్వనన్న సోనియా
- మండిపడ్డ హేమంత్ బిశ్వ శర్మ
- సోనియాది ఫ్యూడల్ భావజాలమంటూ విమర్శలు
యూపీఏ అధినేత్రి సోనియాగాంధీపై బీజేపీ వ్యూహకర్త హేమంత్ బిశ్వ శర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమెలో దాగున్న ఫ్యూడల్ ధోరణికి అద్దం పడుతున్నాయని విమర్శించారు. మోదీని ప్రజలు మరోసారి రానివ్వరు అంటూ విమర్శించాలే కానీ... ఆయనను మళ్లీ నేను రానివ్వను అంటూ ప్రజావేదికలపై మాట్లాడటం... ఆమె వ్యక్తిత్వాన్ని సూచిస్తోందని అన్నారు. శుక్రవారం నాడు సోనియాగాంధీ మాట్లాడుతూ, మోదీపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే, సోనియాపై హేమంత్ విమర్శలు గుప్పించారు.
తాను 23 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో ఉన్నానని... కానీ, ఏనాడూ ఒక్కసారి కూడా మా నాయకుణ్ణి కాని, నాయకురాలిని కానీ కలిసే అవకాశం తనకు రాలేదని హేమంత్ అన్నారు. కాంగ్రెస్ లో పార్టీ పెద్దల వద్దకు వెళ్లడం ఓ పెద్ద తతంగమని చెప్పారు. బీజేపీలో ఆ బాధ లేదని... తాను అమిత్ షా వద్దకు ఎంతో స్వేచ్ఛగా వెళ్లగలనని, ఆయనతో కలిసి భోజనం చేయగలనని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల తాను 23 ఏళ్ల జీవితాన్ని వృథా చేసుకున్నానని చెప్పారు.