Rahul Gandhi: నేనైతే ఆ ఫైలును పెంటకుప్పలోకి విసిరేసి ఉండేవాడిని: రాహుల్ గాంధీ
- పెద్ద నోట్ల రద్దుపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
- తాను ప్రధానిని అయి ఉంటే ఆ ప్రతిపాదన ఫైలును చెత్తబుట్టలో వేసి ఉండేవాడినన్న కాంగ్రెస్ చీఫ్
- ఆగ్నేయాసియా దేశాల్లో పర్యటిస్తున్న రాహుల్
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానే కనుక ప్రధానిని అయి ఉంటే ఆ ప్రతిపాదన తన వద్దకు వచ్చినప్పుడు చెత్తబుట్టలో పడేసి ఉండేవాడినని పేర్కొన్నారు. ఆగ్నేయాసియా దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం మలేషియాలో ఉన్న రాహుల్ కౌలాలంపూర్లో భారత సంతతి ప్రముఖులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయాలన్న నిర్ణయం సరైనది కాదన్నారు. మీరు ప్రధాని అయితే పెద్ద నోట్ల మరోలా ఎలా అమలు చేస్తారన్న ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ.. అసలు ఆ నిర్ణయమే తప్పన్నారు. తాను ప్రధాని మంత్రిని అయి ఉంటే, ఆ ప్రతిపాదన ఫైలు తన వద్దకు వచ్చినప్పుడు దానిని చెత్తబుట్టలో పడేసి ఉండేవాడినని అన్నారు. తలుపు ఆవల పెంటకుప్పలోకి విసిరేసి ఉండేవాడినని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు ఏ రకంగా చూసినా మంచిది కాదన్నదే తన ఉద్దేశమని రాహుల్ తేల్చి చెప్పారు.