Hafiz Saeed: రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు పాక్ ఉగ్రవాది హఫీజ్‌కు లైన్ క్లియర్.. ఆశ్చర్యపోతున్న భారత్!

  • రాజకీయాల్లో సత్తా చాటేందుకు హఫీజ్ రెడీ
  • హఫీజ్ ఎంఎంఎల్ పార్టీని రిజస్టర్ చేయాల్సిందిగా కోర్టు ఆదేశం
  • మున్ముందు ఉగ్రవాద సంస్థలన్నీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందన్న భారత్
  • పాక్ పరిణామాలపై ఇండియా ఆందోళన

పాకిస్థాన్ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు పాక్ ఉగ్రవాది, ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు లైన్ క్లియర్ అయింది. హఫీజ్ స్థాపించిన రాజకీయ పార్టీని రిజస్ట్రేషన్ చేయాల్సిందిగా ఇస్లామాబాద్ హైకోర్టు పాక్ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. హఫీజ్ స్థాపించిన ‘మిల్లీ ముస్లిం లీగ్’ (ఎంఎంఎల్)ను రిజిస్టర్ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ నిరాకరించడంతో ఆయన కోర్టు కెక్కాడు. విచారించిన న్యాయస్థానం ఎంఎంఎల్ రిజస్ట్రేషన్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. విషయం తెలిసిన భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు, ఉగ్రవాది హఫీజ్ రాజ్యంగంపై ప్రమాణం చేయనున్నాడా? అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

జమాత్-ఉద్-దవా చీఫ్ అయిన హఫీజ్ మరోవైపు న్యాయస్థానాలకు సమాంతరంగా లాహోర్‌లో షరియా కోర్టులు నిర్వహిస్తున్నాడు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి ఇక్కడ వేగంగా శిక్షలు పడేలా చేస్తారని పాక్ పత్రిక డాన్ తెలిపింది.

హఫీజ్ కనుక రాజకీయాల్లోకి వచ్చి పోటీకి దిగితే అది మరిన్ని ఉగ్ర సంస్థలకు పిలుపు అవుతుందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. లష్కరే తాయిబా తదితర ఉగ్ర సంస్థలు కూడా మున్ముందు ఎన్నికల బరిలోకి దిగే అవకాశం చిక్కుతుందని వివరించాయి. అదే జరిగితే పాక్‌తో పాటు మొత్తం ప్రపంచానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హఫీజ్ రాజకీయాల్లోకి వస్తే న్యాయబద్ధమైన రాజకీయాలకు తిలోదకాలిచ్చి ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించే లష్కరే వంటి సంస్థలకు
 కొమ్ము కాస్తాడని హెచ్చరిస్తున్నాయి. పాక్‌లోని తాజా పరిణామాలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార  ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఘటనతో పాక్ తన ద్వంద్వ ప్రవృత్తిని, తన నిజస్వరూపాన్ని ప్రపంచానికి మరోసారి చూపించిందని అన్నారు. భారత్‌కు ఇది భారీ షాకేనని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News