Pakyong Airport: సిక్కింలో తొలిసారి ల్యాండైన పాసింజర్ విమానం.. నూతన శకం ఆరంభం!
- తొలి విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించిన స్పైస్ జెట్
- తొలి విమానాశ్రయంలో తొలి సర్వీసు ఆ సంస్థదే
- బెంగాల్ సంస్థల దాడుల నుంచి సిక్కిం ప్రజలకు విముక్తి
- ప్రభుత్వం సహా అందరినీ పేరు పేరున కొనియాడిన ఏకైక ఎంపీ
సిక్కింలో తొలిసారి ఓ పాసింజర్ విమానం ల్యాండై చరిత్ర సృష్టించింది. కోల్‌కతా నుంచి బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం శనివారం సిక్కిం గడ్డపై దిగింది. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన స్పైస్ 70 సీట్ల జెట్ క్యూ400 బాంబార్డియర్ విమానం రాజధాని గ్యాంగ్‌టక్‌కు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్యాంగ్ విమానాశ్రయానికి చేరుకుంది. దాదాపు రెండు గంటల తర్వాత తిరిగి కోల్‌కతాకు పయనమైంది. రూ.650 కోట్ల వ్యయంతో ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని ప్రారంభించగా తొమ్మిదేళ్లకు పూర్తయింది. త్వరలోనే ఇక్కడి నుంచి ఢిల్లీ, కోల్‌కతా, గువాహటికి రెగ్యులర్ విమానాలు నడిపేందుకు విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి.
సిక్కింలోని మెజారిటీ ప్రజలు ఇప్పటికీ సిలిగురిలోని బాగ్డోగ్రా విమానాశ్రయంపైనే ఆధారపడుతున్నారు. ఈ విమానాశ్రాయానికి వచ్చే ప్రయాణికులపై బెంగాల్ సంస్థలు దాడులకు దిగుతున్నాయి. ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం 104 రోజులపాటు ఆందోళన నిర్వహించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన వివిధ సంస్థలు సిక్కిం వాసులపై దాడులకు పాల్పడడం పరిపాటిగా మారింది. ఇప్పుడు సిక్కిం ప్రజలకు పాక్యాంగ్ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో దాడుల బాధ తప్పినట్టే.
సిక్కింలో తొలిసారి పౌర విమానం ల్యాండ్ కావడంపై ఆ రాష్ట్రానికి చెందిన ఒకే ఒక్క ఎంపీ ప్రేమ్ దాస్ రాయ్ ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్, ఎయిర్‌పోర్టు అథారిటీ, స్పైస్‌జెట్, రాష్ట్ర పర్యాటక శాఖ, ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూమి ఇచ్చిన వారు, బిల్డర్లు.. ఇలా అందరినీ పేరుపేరునా అభినందిస్తూ ట్వీట్ చేశారు.