TTV Dinakaran: తమిళనాడు రాజకీయ తెరపైకి మరో కొత్త పార్టీ...!
- ఈ నెల 15న కొత్త పార్టీ ప్రకటించనున్న టీటీవీ దినకరన్
- మధురైలో భారీ బహిరంగ సభ వేదికగా ప్రకటన
- కొత్త పార్టీలతో రసవత్తరంగా మారనున్న తమిళ రాజకీయాలు
తమిళనాడు రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీలు ఒక్కొక్కటిగా ప్రజలను పలకరిస్తున్నాయి. యూనివర్శల్ హీరో కమల్ హాసన్ 'మక్కళ్ నీది మయ్యమ్' పార్టీని ఆవిష్కరించారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ మరికొన్ని రోజుల్లో తన పార్టీ గురించి ఓ ప్రకటన చేయనున్నారు. ఇదిలా ఉంటే, అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ ఓ కొత్త పార్టీతో ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని రోజులుగా ఆయన పార్టీ పెట్టబోతున్నారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కొత్త పార్టీ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారైపోయింది. ఈ నెల 15నే దినకరన్ తన పార్టీ పేరుతో పాటు గుర్తును కూడా ప్రకటించబోతున్నారు.
మధురైలో ఓ బహిరంగ సభను ఏర్పాటు చేయడం ద్వారా తన పార్టీ సిద్ధాంతాలను వెల్లడిస్తానని ఆయన చెప్పారు. ప్రజాదరణ ఉన్న అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురికావడం, పార్టీ రెండాకుల గుర్తును కూడా న్యాయపోరాటంలో కోల్పోవడంతో దినకరన్ కొత్త పార్టీ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులో ఇప్పటికే ప్రజల ఆదరణ మెండుగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేలతో పాటుగా కమల్, రజనీ పార్టీలు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనుండటంతో అక్కడి రాజకీయాలు నిస్సందేహంగా రసవత్తరంగా మారనున్నాయి.