Telangana: చెప్పినట్టుగానే నరసింహన్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రయత్నం!
- ఉదయం 10 గంటలకు ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
- గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- నినాదాలు చేస్తూ పోడియంలోకి దూసుకెళ్లే ప్రయత్నం
- అడ్డుకున్న మార్షల్స్ - సభలో గందరగోళం
తెలంగాణ రాష్ట్ర 2018-19 బడ్జెట్ సమావేశాల తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్న వేళ, ముందుగా హెచ్చరించినట్టుగానే కాంగ్రెస్ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ స్థానాల్లో లేచి నిలబడి నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డి తదితర సభ్యులు చేస్తున్న నినాదాల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా శరవేగంగా అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు. ఈ మూడున్నరేళ్లలో చాలా సవాళ్లను అధిగమించామని, కాళేశ్వరం వంటి ప్రాజెక్టు రాష్ట్రానికి వరప్రదాయినిగా మారనుందని అన్నారు. ఇప్పటికే 24 గంటలూ కోతల్లేని విద్యుత్ ను అందిస్తున్న తన ప్రభుత్వం, సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు శరవేగంగా సాగుతున్నాయని నరసింహన్ వెల్లడించారు. అన్ని వర్గాల ఆర్థిక ప్రగతిపై దృష్టి పెట్టిన తన ప్రభుత్వం, గొర్రెల పంపిణీ పథకాన్ని విజయవంతం చేసిందని అన్నారు.
ఈ సమయంలో, అంతవరకూ తమ తమ స్థానాల్లోనే కూర్చుని నినాదాలు చేసిన కాంగ్రెస్ సభ్యులు పోడియం వైపు వచ్చేందుకు ప్రయత్నించడంతో మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. దీంతో సభలో మరింత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నరసింహన్ మాత్రం తన ప్రసంగాన్ని నినాదాల మధ్యే కొనసాగించారు.