United Nations: వాతావరణ మార్పులతో మహిళలకే అధిక చేటు : ఐరాస నివేదిక
- వాతావరణ మార్పులతో 80 శాతం మంది మహిళలకు ఇబ్బందులు
- అందుకే 2015-ప్యారిస్ ఒప్పందంలో వారికి పెద్దపీట
- 'హరికేన్ కత్రినా' తర్వాత మహిళలకు లోపభూయిష్టమైన పునరావాస ఏర్పాట్లు
వాతావరణంలో రోజురోజుకూ చోటుచేసుకుంటున్న మార్పులతో పెను ప్రభావాలను మనం ఇప్పటికే చవిచూస్తున్నాం. రుతులు గతులు తప్పుతున్నాయి. ఫలితంగా అకాల వర్షాలు, వడగండ్ల వానలు, సునామీలు, సముద్రాల్లో భూకంపాలు...ఇలా కొన్నేళ్లుగా చిత్రమైన రీతిలో ప్రమాదాలు మానవులను కబళిస్తున్నాయి. వాతావరణంలో కర్బన ఉద్గారాల శాతం స్థాయిని మించిపోవడంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మనుషులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. వాతావరణంలోని మార్పుల ప్రభావం పురుషుల కంటే మహిళలపైనే అధికంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి (ఐరాస) తన తాజా నివేదికలో హెచ్చరించింది. ఆ నివేదిక ప్రకారం, వాతావరణ మార్పు వల్ల 80 శాతం మంది మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని బీబీసీ తెలిపింది.
ఈ కారణంగా పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన 2015 నాటి ప్యారిస్ ఒప్పందంలో మహిళల సాధికారతకు పెద్దపీట వేశారు. మధ్య ఆఫ్రికాలోని 'లేక్ ఛాద్' సరస్సు 90 శాతం మేర ఎండిపోయింది. పర్యవసానంగా ప్రత్యేకించి దేశవాళీ సంచారజాతుల బతుకులు ప్రమాదంలో పడ్డాయి. సరస్సులోని నీరు ఇంకిపోవడంతో స్థానిక మహిళలు తాగునీటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. "నీటి ఎద్దడి తలెత్తిన సమయాల్లో పురుషులు సమీపంలోని పట్టణాలకు వలస వెళుతారు. ఆ సమయంలో ఇంటి బాధ్యతలను మహిళలు నిర్వర్తిస్తారు" అని అసోసియేషన్ ఆఫ్ ఇండీజినస్ విమెన్ అండ్ పీపుల్ ఆఫ్ చాద్ (ఏఎఫ్‌పీఏటీ) సమన్వయకర్త హిందౌ ఒమరౌ ఇబ్రహీం బీబీసీకి తెలిపారు.
మరోవైపు 'హరికేన్ కత్రినా' బీభత్సం తర్వాత బాధితుల పునరావాసం కోసం ఏర్పాటు చేసిన 'ది సూపర్‌డోమ్'ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇందులో పునరావాసం పొందిన మహిళలకు తగిన పారిశుద్ధ్య వసతులు కల్పించలేదు. అందువల్ల పర్యావరణ మార్పుల ప్రభావాల విషయంలో మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించాల్సి ఉందని ఐరాస అభిప్రాయపడింది. మరోవైపు పర్యావరణ మార్పులపై చర్చలకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పనిచేస్తున్న సంస్థల్లోనూ మహిళలకు తగినంత ప్రాతినిధ్యం లేదు. వారి ప్రాతినిధ్యం 30 శాతం కంటే తక్కువగా ఉందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలకు సామాజిక, ఆర్థిక సాధికారత ఉన్న దేశాల్లో పరిస్థితి ఇందుకు కాస్త భిన్నంగా ఉందని మరో అధ్యయనం తెలిపింది.