TRS: టీఆర్ఎస్ చేస్తున్నదంతా డ్రామాయే: నిప్పులు చెరిగిన డీకే ఆరుణ
- ప్రతిపక్షాల గొంతు నొక్కేయాలని చూస్తున్న టీఆర్ఎస్
- మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదిది
- విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ
అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కేయడం ద్వారా సమస్యలను పక్కదారి పట్టించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, నేడు అసెంబ్లీలో జరిగిందంతా డ్రామాయేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజున తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడ్డ తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని అన్నారు. సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వారు ఇవ్వదలచుకున్న సమయం మాత్రమే ఇస్తారని, వారికి ఇష్టమైనన్ని రోజులు మాత్రమే సభను నడుపుతారని ఆరోపించారు. పైకి మాత్రం ఎంత సేపైనా చర్చలకు సిద్ధమని, ఎన్నిరోజులైనా సభ నడిపిస్తామని కబుర్లు చెబుతారని దుయ్యబట్టారు.
గడచిన నాలుగేళ్లలో అసెంబ్లీలో జరిగిన నిరసనలను ఎన్నడూ మీడియాకు ప్రత్యక్ష ప్రసారం చేయని టీఆర్ఎస్, నేడు ఓ పథకం ప్రకారం మొత్తం లైవ్ దృశ్యాలను ప్రసారం చేసిందని, ఆపై మీడియాకు ఫుటేజ్ ఇచ్చిందని, ఇదంతా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రీ ప్లాన్డ్ గా చేసిన పనేనని డీకే అరుణ ఆరోపించారు. దురుద్దేశంతోనే ప్రతిపక్షాలను కట్టడి చేయాలని టీఆర్ఎస్ భావిస్తోందని, రేపు టీఆర్ఎస్ ఏం చర్యలు తీసుకున్నా తాము భయపడబోమని, ప్రజల్లోకి వెళ్లి నిజా నిజాలను వెల్లడిస్తామని అన్నారు. సభ్యులు నిరసనలు తెలిపేవేళ, చేతిలో ఉన్నది ఏదో ఒకటి విసరడం సర్వసాధారణమని, గతంలో ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయని గుర్తు చేసిన ఆమె, ఎవరినీ టార్గెట్ చేసుకోని ఎవరూ ఏమీ విసిరివేయరని వ్యాఖ్యానించారు. స్వామిగౌడ్ గాయం వెనుక పొలిటికల్ డ్రామా ఉందా? అన్న విషయాన్ని తెలుసుకుంటామని చెప్పారు.