USA: కిమ్ తో ట్రంప్ సమావేశం ఏప్రిల్ లోనా? మే లోనా? అనేది ఇప్పుడే చెప్పలేం: వైట్ హౌస్
- భాగస్వామ్య దేశాలతో పాటు ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వంగల దేశాల ఒత్తిడి ఫలించింది
- చర్చలకు సిద్ధమని ప్రకటించడమే పెద్ద ముందడుగు
- చర్చలకు షరతులు విధించలేదు
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలపై వైట్ హౌస్ అధికార ప్రతినిధి రాజ్ షా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా కిమ్ జాంగ్ ఉన్ తో చర్చలు ఏప్రిల్ లో జరుపుతామా? లేక మేలో జరుపుతామా? అన్నది ఇప్పుడే చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. చర్చలకు సిద్ధమని ప్రకటించడమే పెద్ద ముందడుగని ఆయన తెలిపారు. దీంతో ఎలాంటి అదనపు షరతులు విధించలేదని అన్నారు. అణ్వాయుధ పరీక్షలు నిలిపేస్తామని, దక్షిణ కొరియా, అమెరికాలు సంయుక్తంగా నిర్వహించుకునే సైనిక విన్యాసాలపై విమర్శలు చేయమని ఉత్తరకొరియా చెప్పిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో దౌత్యపరమైన అంశాలే ఉంటాయని ఆయన అన్నారు. సమావేశ ముఖ్యలక్ష్యంపై తమ అధ్యక్షుడికి పూర్తి స్పష్టత ఉందని ఆయన అన్నారు. తమ భాగస్వామ్య దేశాలతో పాటు ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వంగల దేశాల నుంచి చేసిన ఒత్తిడి సత్ఫలితం ఇచ్చిందని ఆయన అన్నారు.