Telangana: తెలంగాణ ప్రభుత్వ ప్రతి శాఖకు ‘ట్విట్టర్’, ‘ఫేస్ బుక్’ అకౌంట్ ఉండేలా చూడాలి : సీఎస్ జోషి

  • ప్రభుత్వ వెబ్ సైట్లు, పోర్టల్ కు సంబంధించి సమీక్షా సమావేశం
  • సమాచారం అప్ డేషన్ వంటి అంశాలతో నివేదికను రూపొందించాలి : జోషి ఆదేశాలు
  • ప్రతి శాఖకు సంబంధించిన ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్స్ లో ప్రభుత్వ లోగో, ముఖ్యమంత్రి  ఫోటో ఉండాలి
  • అన్ని శాఖల వెబ్ సైట్లకు రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ కేంద్ర స్థానంగా ఉండాలి : ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్

తెలంగాణ ప్రభుత్వంలోని ప్రతి శాఖకు ‘ట్విట్టర్’, ‘ఫేస్ బుక్’ ఖాతాలు ఉండేలా చూడాలని, రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, ఏజన్సీల వెబ్ సైట్లను ఐటి శాఖ ద్వారా నిర్వహించే విషయమై తగు నివేదికను పది రోజుల్లోగా సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కె.జోషి ఆదేశించారు. తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ వెబ్ సైట్లు, పోర్టల్ కు సంబంధించి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, ఐటి డైరెక్టర్ దిలీప్ కొణతం తదితరులు పాల్గొన్నారు. ఈ
సందర్భంగా జోషి మాట్లాడుతూ, రాష్ట్రంలో వివిధ శాఖలకు సంబంధించి 265 వెబ్ సైట్స్/ పోర్టల్స్ ఉన్నాయని వీటి నిర్వహణ, సమాచారం అప్ డేషన్, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మేర నిబంధనల పాటింపు, అనువైన నూతన టెక్నాలజీ వినియోగం, మొబైల్ ఫ్రెండ్లీ విధానం తదితర అంశాలతో నివేదికను రూపొందించాలని ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ శాఖ ఐటీ సర్వీసు ప్రొవైడర్ గా పనిచేయాలని, అవసరమైతే సీజీజీ సహకారాన్ని తీసుకోవాలని, వెబ్ సైట్ల నిర్వహణ, సమాచారం అప్ డేషన్ కు సంబంధించి ప్రభుత్వం తరపున చేపట్టాల్సిన చర్యలు, ప్రతి వెబ్ సైట్ లో ఉండాల్సిన అంశాల టెంప్ లేట్ , వివిధ శాఖల సర్వీసుల వివరాలు, అవసరమైన సిబ్బంది, బడ్జెట్, వెండర్ ఎంపిక తదితర అంశాలు నివేదికలో ఉండాలని జోషి సూచించారు. ప్రతి శాఖకు సంబంధించి ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్ ఉండేలా చూడాలని, వాటిలో ప్రభుత్వ లోగో, ముఖ్యమంత్రి  ఫోటో ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్వహించే ప్రతిష్టాత్మక కార్యక్రమాల వివరాలు, జీవోలు తెలుగులో అప్ లోడింగ్, వివిధ శాఖల కార్యక్రమాల వివరాలు, తెలియజేసేలా వెబ్ సైట్లు ఉండాలని, వెబ్ సైట్ల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అన్ని శాఖల వెబ్ సైట్లకు రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ కేంద్ర స్థానంగా ఉండాలని పేర్కొన్నారు.

అనంతరం, ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ, ఐటి శాఖ ద్వారా రాష్ట్ర పోర్టల్, ఐటి శాఖ పోర్టల్ ను నిర్వహించడంతో పాటు వివిధ శాఖలకు సహకారం అందిస్తున్నామని, డిజిటల్ మీడియా విభాగం ద్వారా ముఖ్యమంత్రి, రాష్ట్ర ఐటి శాఖా మంత్రి సోషల్ మీడియా అకౌంట్స్ ను నిర్వహిస్తున్నామని అన్నారు. వివిధ శాఖలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, ‘ఫేస్ బుక్’ నిర్వహణపై శిక్షణను ఇచ్చామని, వెబ్ సైట్లను  మొబైల్ ఫ్రెండ్లీ గా నిర్వహించే విషయమై ‘గూగుల్’ సహకారంతో వర్క్ షాప్ నిర్వహించినట్టు చెప్పారు.ప్రజా సమస్యల ఫిర్యాదులు, వాటి పరిష్కారం కోసం సూర్యాపేట జిల్లాలో అమలు చేస్తున్న జనహిత విధానాన్ని ఈ సందర్భంగా సమీక్షించారు. ప్రజలు తమ ఫిర్యాదులను ప్రత్యక్షంగా ఇవ్వడంతో పాటు ఇ-మెయిల్, ఆన్ లైన్, వాట్సాప్, మోబైల్ ద్వారా చేస్తున్నారని, 40 శాతం మంది వీటి మీద ఆధారపడుతున్నారని అధికారులు సీఎస్ కు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పద్ధతిని అమలు చేసే విధానంపై చర్చించారు. ప్రజల ఫిర్యాదులను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

  • Loading...

More Telugu News