chinmayi: సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసిన యువ గాయని చిన్మయి
- ఓ గుర్తుతెలియని వ్యక్తి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు
- బాల్యంలో చాలా మంది లైంగిక వేధింపులకు గురవుతున్నారు
- ఆ విషయం బయటకు చెప్పడం లేదు
- బాలికలతో పాటు బాలురు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారు
ప్రముఖ గాయని చిన్మయి తాజాగా చిన్నారులపై జరుగుతోన్న లైంగిక వేధింపులపై వరుసగా ట్వీట్లు చేశారు. అలాగే తనపై జరిగిన వేధింపుల పట్ల కూడా అందులో ప్రస్తావించారు. తాను ఇటీవల ఓ కార్యక్రమానికి వెళ్లానని అక్కడ ఓ గుర్తుతెలియని వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ తనను లైంగికంగా తాకాడని ఆమె అన్నారు. చాలా మంది మహిళలు, పురుషులు చిన్నతనంలో ఇలాగే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారేనని తెలియడంతో తాను షాకయ్యానని అన్నారు.
చిన్నారులు తమ ఉపాధ్యాయులు, అంకుల్స్ చివరకు మహిళల చేతిలో కూడా వేధింపులు ఎదుర్కొన్నవారు ఉన్నారని ఆమె ట్వీట్ చేశారు. సమాజంలో బస్సులు, రైళ్లతో పాటు ఆధ్యాత్మిక స్థలాల్లో, ఇళ్లలో, విద్యాలయాల్లోనూ లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆమె అన్నారు. తాము ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి తమ కుటుంబసభ్యులు, స్నేహితులకు చెప్పడానికి చాలామంది చిన్నారులకు ధైర్యం చాలాదని అన్నారు.
తాము చెప్పినా నమ్మరేమోనని వారు అనుకుంటారని చెప్పారు. అలాగే బాల్యంలో తమపై జరిగిన లైంగిక దాడి గురించి పురుషులు చెబితే వారిని హేళన చేస్తారని, మరోవైపు మహిళలు చెబితే వాటిని వింటూ ఎంజాయ్ చేస్తారని ఆమె అన్నారు. లైంగిక వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెబితే బయటకు వెళ్లొద్దని, చదువు, ఉద్యోగం మానిపిస్తారని కొందరు చెప్పబోరని ఆమె అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కొద్దిగా మార్పు వచ్చినట్లు కనపడుతోందని ఆమె తెలిపారు.