bhooma akhila priya: ఆళ్లగడ్డను ఎప్పుడు పీక్కుతిందామా అని గుంట నక్కలు ఎదురు చూశాయి : భూమా అఖిలప్రియ
- మా తండ్రి మరణానంతరం గుంటనక్కలన్నీ ఒక దగ్గరకు చేరాయి
- భూమా వర్గాన్ని విడదీయాలని చూస్తున్నారు
- మందుకు, డబ్బుకు కక్కుర్తిపడే వాళ్లెవరూ భూమా వర్గం కానేకాదు : అఖిల ప్రియ
ప్రజలకు మంచి చేయాలని తన తండ్రి భూమా నాగిరెడ్డి ఎంతో తపన పడుతుండేవారిని, కానీ, అప్పట్లో ఉన్న దుష్టశక్తులు ఆయనపై ఒత్తిడి తేవడంతో పాటు ఇబ్బందిపెట్టాయని, ఆయన మృతికి ఒకవిధంగా కారణమయ్యాయని మంత్రి అఖిలప్రియ అన్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన భూమా నాగిరెడ్డి వర్థంతి కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ, ఎప్పుడైతే తన తండ్రి చనిపోయారో, అప్పుడు, గుంటనక్కలన్నీ ఒక దగ్గరకు చేరాయని, ఆళ్లగడ్డను ఎప్పుడు పీక్కుతిందామా అని ఎదురు చూశాయని విమర్శించారు. ‘భూమా నాగిరెడ్డి గారి కుటుంబంలో మీసం వచ్చిన మగపిల్లలను ఎలా పెంచారో, గాజులు వేసుకున్న ఆడపిల్లలను కూడా వారితో సమానంగా పెంచారు. అవసరం వస్తే, ఆడపిల్లలతో సహా సైనికుల్లాగా పని చేసి కుటుంబాన్ని, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. డబ్బురాజకీయాలు, మందు రాజకీయాలతో భూమా వర్గాన్ని విడదీయాలని చాలా మంది చూస్తున్నారు. మందుకు, డబ్బుకు కక్కుర్తిపడే వాళ్లెవరూ భూమా వర్గం కానేకాదు’ అని అఖిలప్రియ అన్నారు.