devineni: నదుల మహా సంగమంతో కరవుకు చెక్ : ఏపీ మంత్రి దేవినేని
- ప్రాధాన్యత ప్రాజెక్టులుగా మరో రెండు ప్రాజెక్టులు
- గుండ్రేవుల రిజర్వాయర్, తోటపల్లి కుడి, ఎడమ కాలువల అభివృద్ధి పనులకు ప్రభుత్వ నిర్ణయం
- ప్రారంభానికి సిద్ధంగా 5 ప్రాజెక్టులు : దేవినేని
గోదావరి - పెన్నా, గోదావరి - కృష్ణా, వంశధార - నాగవళి నదుల అనుసంధానాలతో కలిపి మహా సంగమం ద్వారా ఏపీలో కరవుకు చెక్ పెట్టనున్నట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సోమవారం - పోలవారంగా గుర్తించిన సీఎం చంద్రబాబునాయుడు 53వ వర్చువల్ సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించారని, ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్టులో చేపట్టిన పనుల వివరాలను ఆయనకు అధికారులు వివరించినట్టు పేర్కొన్నారు. గత వారం నుంచి పోలవరం కాంక్రీట్ పనులు వేగవంతంగా సాగుతున్నాయని, ఈ ఏడాది మే నాటికి డయాఫ్రమ్ వాల్, జూన్ 15 నాటికి జెట్ గ్రౌంటింగ్ పనులు పూర్త అవుతాయని అధికారులు వివరించి చెప్పినట్టు దేవినేని పేర్కొన్నారు.
ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు 54.4% పూర్తయిందని, కుడి ప్రధాన కాలువ 91%, ఎడమ ప్రధాన కాలువ 59.6%, హెడ్ వర్క్స్ 41.2%, మొత్తం తవ్వకం పనులు 70%, 1115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 778.80 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు, స్పిల్ వే, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు 16%, డయాఫ్రమ్ వాల్ 72%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 58% పూర్తయినట్టు చెప్పారు. స్పిల్‌వే, ఈసీఆర్ఎఫ్ డ్యామ్, గేట్లకు సంబంధించి మొత్తం 42 డిజైన్లకు గాను ఇప్పటివరకు 14 డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదించిందని, మరో 16 డిజైన్లను సమర్పించడం జరిగిందని తెలిపారు.
ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో మరో రెండు ప్రాజెక్టులు
రాష్ట్రంలో చేపట్టిన ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో మరో రెండింటిని చేర్చాలని చంద్రబాబు ఆదేశించినట్లు దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. కర్నూలు జిల్లాలోని గుండ్రేవుల రిజర్వాయర్, తోటపల్లి కుడి, ఎడమ కాలువల అభివృద్ధి పనులు కొత్తగా చేపట్టనున్నామని, దీంతో రాష్ట్రంలో చేపట్టిన ప్రాధాన్యత ప్రాజెక్టుల సంఖ్య 52కు చేరిందని చెప్పారు. ఈ ప్రాధాన్యతా ప్రాజెక్టులలో ఇప్పటివరకు 8 ప్రాజెక్టులు ప్రారంభించామని, మరో 5 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఇవే కాక, మరో 15 ప్రాజెక్టులు ఈ ఏడాది జూన్ 15 నాటికి సిద్ధం కానున్నట్టు చెప్పారు. మిగిలిన ప్రాజెక్టులు ఈ ఏడాది డిసెంబర్, వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామని అన్నారు.
రూ.247 కోట్ల ‘జల సంరక్షణ ఉద్యమం’ పనులు
జల సంరక్షణ ఉద్యమంలో భాగంగా రూ. 247 కోట్ల విలువైన పనులు చేపట్టినట్లు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. గడిచిన 30 రోజుల్లో శరవేగంగా చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యామ్‌లు, పంటకుంటలు, కాలువలు, డ్రైయిన్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
‘కెల్లర్’కు విశ్వకర్మ అవార్డు
పోలవరం గ్రౌండ్ ఇంజినీరింగ్ పనులు చేపిట్టిన కెల్లర్ గ్రౌండ్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ‘సీఐడీసీ విశ్వకర్మ అవార్డు-2018’ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు దేవినేని తెలిపారు. ఈ సందర్భంగా కెల్లర్ గ్రౌండ్ ఇంజినీరింగ్ సంస్థను చంద్రబాబు అభినందించినట్లు తెలిపారు.