Mamata Banerjee: సోనియాగాంధీకి షాకిచ్చిన మమత.. నేటి డిన్నర్‌కు డుమ్మా!
- నేడు ప్రతిపక్ష పార్టీలకు సోనియా విందు
- హాజరుకానున్న పలువురు నేతలు
- డార్జిలింగ్ వెళ్లిపోతున్న మమత
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీకి షాకిచ్చారు. ప్రతిపక్ష నేతలకు నేడు ఇస్తున్న విందుకు హాజరుకాబోవడం లేదని పేర్కొన్నారు. తనకు బదులుగా పార్టీ సీనియర్ నేతలైన డెరెక్ ఒబ్రెయిన్, సుదీప్ బందోపాధ్యాయలలో ఒకరిని పంపాలని నిర్ణయించిట్టు తెలుస్తోంది. డార్జిలింగ్, ఆ పరిసర ప్రాంతాల పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలోనే మమత ఈ విందుకు హాజరుకాలేకపోతున్నట్టు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపాలనే ఉద్దేశంతో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటును తెరపైకి తీసుకొచ్చిన సోనియా ఈ విందును ఏర్పాటు చేశారు. విందు సందర్భంగా ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. ఈ విందుకు బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ సహా పలువురు నేతలను ఆహ్వానించారు. విందుకు హాజరుకావాల్సిందిగా మాంఝీని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ స్వయంగా ఆహ్వానించారు. ఇటీవలే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన మాంఝీ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఆధ్వర్యంలోని మహా కూటమిలో చేరారు.
బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరేందుకు సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఎన్సీపీ, హెచ్ఏఎం తదితర పార్టీలు ముందుకొచ్చాయి. విందుకు రావాల్సిందిగా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను సోనియా ఆహ్వానించారు. కాగా, పలువురు ప్రముఖులు హాజరవుతున్న ఈ విందుకు మమత బెనర్జీ డుమ్మా కొట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.