isro: ఇస్రో కీలక కంప్యూటర్ లోకి చొరబడిన హ్యాకర్... ధ్రువీకరించిన భారత్, ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు

  • ఇస్ ట్రాక్ కంప్యూటర్ లో తిష్టవేసిన ఎక్స్ ట్రీమ్ ర్యాట్ మాల్ వేర్
  • దానిని తొలగించేందుకు ఫ్రాన్స్ నిపుణుడు రాబర్ట్ బాప్టిస్ట్ ను రప్పించిన ఇస్రో
  • ఒక పోర్ట్ లోకే ప్రవేశించిందని, సర్వర్లలోకి జోరబడలేదని నిర్ధారించిన రాబర్ట్

ఇస్రో అంతరిక్షంలోని ఉపగ్రహాలను ట్రాక్‌ చేసే ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌ వర్క్‌ (ఇస్‌ ట్రాక్‌) హ్యాకర్ల చేతికి చిక్కిందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. 2017 డిసెంబర్ లో 'ఎక్స్ ట్రీమ్ ర్యాట్' అనే మాల్ వేర్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిని తొలగించేందుకు ఫ్రాన్స్ కు చెందిన సాఫ్ట్ వేర్ నిపుణుడు రాబర్ట్ బాప్టిస్ట్ ను రప్పించారు. సర్వర్లను పరీశీలించిన ఆయన 'ఎక్స్ ట్రీమ్ ర్యాట్ మాల్ వేర్' పూర్తిగా సర్వర్లలోకి ప్రవేశించలేదని తేల్చారు. దీంతో అది ఏ విభాగంలో చేరిందో ఆ విభాగం కంప్యూటర్ల పోర్ట్ ను మూసేశారు.

కాగా, హ్యాకింగ్ కు గురైన కీలక కంప్యూటర్ పోర్ట్ ను.. ఇస్రో రాకెట్ల ప్రయోగంతో పాటు, ప్రయోగించిన ఉపగ్రహాలను పరిశీలించేందుకు వినియోగిస్తారు. ఉపగ్రహాలను ప్రయోగించే సమయంలో రాకెట్లు విడిపోవడానికి ఉపయోగించే కంప్యూటర్‌ ను దీనికి అనుసంధానిస్తారు. శోధన్‌ సెర్చ్ ఇంజిన్‌ ను ఉపయోగించినప్పుడు ఈ వైరస్‌ ఇతర కంప్యూటర్లపై దాడిచేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కాగా, వాణిజ్య అవసరాలకు వినియోగించే రిమోట్‌ యాక్సెస్‌ ట్రోజెన్ ను ‘ఎక్స్‌ ట్రీమ్ ర్యాట్‌’ అంటారు.

 హ్యాకర్లు గూఢచర్యానికి, కీలక సమాచారం తస్కరించేందుకు దీనిని వినియోగిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఈ మాల్ వేర్ కి చెందిన చాలా ర్యాట్లు డార్క్ నెట్ సైట్లలో ఉచితంగా, లేదా విక్రయానికి అందుబాటులో ఉంటాయని వారు వెల్లడించారు. ఒకసారి కంప్యూటర్ లోకి చొరబడ్డ ర్యాట్లు, అక్కడ తిష్టవేసి, అందులోని కీలక సమాచారాన్ని హ్యాకర్ కు అందిస్తుందని అన్నారు. ఆ కంప్యూటర్ యాక్సెస్ హ్యాకర్ చేతికి అందిన తరువాత, దానిని విక్రయించడం, లేదా దుర్వినియోగం చేయడం హ్యాకర్ ఇష్టంపై ఆధారపడి ఉంటుందని వారు వెల్లడించారు.

ఇస్రోలోని కంప్యూటర్ లో తిష్టవేసిన ఎక్స్ ట్రీమ్ ర్యాట్ మాల్ వేర్ కూడా కీలక కంప్యూటర్‌ లోని సమాచారం, దాని యాక్సెస్ వివరాలు హ్యాకర్ చేతికి అందించి ఉంటుందని అనుమానిస్తున్నారు. దీంతో ఆ విభాగాన్ని మూసేశారు. దీనిని భారత్‌, ఫ్రాన్స్‌ లకు చెందిన పరిశోధకులు ధ్రువీకరించారు. కాగా, ఈ మాల్‌ వేర్లు సాధారణంగా విద్యుత్తు, పెట్రోలియం రిఫైనింగ్‌ వ్యవస్థలపై దాడి చేస్తుంటాయని, ఇస్రోపై కూడా దాడి చేయడంపై పరిశోధన చేస్తున్నామని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News