Hadiya: న్యాయపోరాటంతో రెండేళ్లు నష్టపోయా...పరిహారమివ్వండి: 'లవ్ జీహాద్' హదియా డిమాండ్
- నా జీవితంలో రెండేళ్ల విలువైన జీవితాన్ని కోల్పోయా
- నా తల్లిదండ్రుల నుంచి నష్టపరిహారాన్ని కోరలేదు
- కేరళ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నా
ఓ ముస్లిం యువకుడ్ని పెళ్లి చేసుకున్నందుకు సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన 'లవ్ జీహీద్' హదియా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర హైకోర్టు తన పెళ్లిని రద్దు చేసిన తర్వాత తాను చాలా నష్టపోయానని, తన తల్లిదండ్రులకు దూరమయ్యానని ఆమె వాపోయింది.
"నేను నా తల్లిదండ్రుల నుంచి నష్టపరిహారం కోరినట్లు మీడియాలో పలు వార్తలు వచ్చాయి. అవన్నీ పూర్తిగా అవాస్తవం. నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని కోరుతున్నాను" అని హదియా కోజికోడ్‌లో నిన్న విలేకరులకు తెలిపింది. రెండున్నరేళ్ల పాటు తాను న్యాయపోరాటం చేశానని ఆమె గుర్తు చేసింది. తాను అక్షరాలా గృహనిర్బంధానికి గురయ్యానని ఆమె వాపోయింది. తన జీవితంలో రెండేళ్ల విలువైన జీవితాన్ని కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లిదండ్రులు తనకు హాని తలపెడతారని తాను భావించడం లేదని, కానీ వారు కొంతమంది జాతి వ్యతిరేక శక్తుల చేతిలో కీలుబొమ్మలుగా మారారని ఆమె వ్యాఖ్యానించింది.