KCR: కాంగ్రెస్ నయా ప్లాన్... రాజీనామాలకు ఎమ్మెల్యేలు సిద్ధం!
- మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం
- సీఎల్పీలో జానారెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ
- రాజీనామాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న వ్యూహం
- నేటి సాయంత్రానికి కీలక నిర్ణయం వెలువడే అవకాశం
కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాలను రద్దు చేయడం ద్వారా రెండు అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఖాళీ చేయించగా, దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్న కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికను రూపొందించే పనిలో నిమగ్నమై ఉంది. ప్రజా తీర్పును అవహేళన చేసేలా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్, సీఎల్పీలో జానారెడ్డి అధ్యక్షతన కొద్దిసేపటి క్రితం సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ వ్యూహం పన్నినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ చరిత్రలో విపక్ష నేతను సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారని గుర్తు చేస్తున్న కాంగ్రెస్ నేతలు, టీఆర్ఎస్ వైఖరిని ప్రజల్లోనే ఎండగట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారని, అందుకు తగ్గట్టుగానే తాము కూడా వ్యవహరించాలన్నది కాంగ్రెస్ అభిమతం. కాంగ్రెస్ సభ్యులు రాజీనామాలు చేస్తే, స్పీకర్ వాటిని ఆమోదిస్తారా? అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.
ఇప్పటికే చాలా మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల రాజీనామాలు స్పీకర్ వద్ద దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నాయి. కాంగ్రెస్ రాజీనామాలను ఆమోదించాలన్న ఆలోచనకు స్పీకర్ వస్తే, మిగతా సభ్యుల సంగతేంటని కాంగ్రెస్ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజకీయ వేడి పుట్టించాలని భావిస్తున్న కాంగ్రెస్, మరికొన్ని గంటల్లో రాజీనామాలపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.