indigo airlines: నిలిచిపోయిన ఇండిగో విమాన సర్వీసులు... 47 ఫ్లయిట్లను రద్దు చేస్తూ ప్రకటన
- ఇంజన్లలో సమస్యలే కారణం
- ఎనిమిది విమానాలను తక్షణం ఆపేయాలని డీజీసీఏ ఆదేశం
- హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాలకు సర్వీసులు బంద్
చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులు దాదాపుగా నిలిచిపోయాయి. ఈ సంస్థకు చెందిన ఏ320 నియో విమానాలు ఎనిమిదింటిలో సమస్యలు ఉన్నాయంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిలిపివేసింది. దీంతో దేశీయ మార్గంలో ప్రయాణించే 47 ఫ్లయిట్లను రద్దు చేస్తున్నట్టు ఇండిగో ప్రకటన జారీ చేసింది. ఇలా రద్దయిన వాటిలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, శ్రీనగర్, భువనేశ్వర్, అమృత్ సర్, శ్రీనగర్, గువహతి తదితర నగరాలకు వెళ్లే సర్వీసులు ఉన్నాయి. నిన్న లక్నో కు వెళుతున్న ఇండిగో ఫ్లయిట్ ఒకటి ఇంజన్ వైఫల్యంతో 40 నిమిషాల్లోనే అహ్మదాబాద్ కు తిరిగొచ్చిన నేపథ్యంలో భద్రతా కోణంలో డీజీసీఏ ఇండిగోకు చెందిన ఎనిమిది విమానాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.